ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా
ABN , Publish Date - Jul 25 , 2024 | 04:11 AM
ఐదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి... అధికారం పోయిన ఆరు వారాలకే ‘ఏపీలో హింసాకాండ’ అంటూ ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగారు.
మేం ప్రతీకార చర్యలు ప్రోత్సహించలేదు
ఏపీలో హింసాకాండ అని ఆక్రోశం
కార్యక్రమం ఆసాంతం సమన్వయ లోపం
జనంలేకపోవడంతో జగన్ అసహనం
బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి... అధికారం పోయిన ఆరు వారాలకే ‘ఏపీలో హింసాకాండ’ అంటూ ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ బుధవారం జంతర్‌మంతర్ వద్ద పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ చెలరేగిపోతోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతోంది’’ అని జగన్ ఆక్రోశించారు. ఈ నిరసన గజిబిజిగా సాగింది. భారీ జన సమూహంతో ఉదయం 11 గంటలకు ధర్నా చేద్దామని వచ్చిన జగన్.. ఆ ప్రాంగణాన్ని చూసి అవాక్కయ్యారు. అక్కడ 200 మంది కూడా లేరు. వారిలోనూ సగం మంది పోలీసులు, మీడియా ప్రతినిధులే. దీంతో కార్యక్రమ నిర్వాహకులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులే విస్తుపోయారు. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా... మైకు సరిగా పనిచేయలేదు. తర్వాత... మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించింది. ‘ఎవరూ స్టేజీ మీదికి రావొద్దు’ అని ఆయన చెప్పడంతో కీలక నాయకులూ దూరంగా వెళ్లిపోయారు. జగన్ కలుగజేసుకుని అందరికీ సర్దిచెప్పారు. వేదికపై వసతులు, ఏర్పాట్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమమంతా సమన్వయం లేకుండా సాగిందంటూ పార్టీ నేతలు పెదవి విరిచారు.
రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం..
జగన్ మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. గురు, శుక్రవారాలు సైతం ఇక్కడే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతోపాటు కొందరు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోరగా, స్పందన రాలేదని తెలిసింది.
బీజేపీ వ్యతిరేకుల మద్దతు...
వైసీపీ ధర్నాకు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను ఆహ్వానించడం గమనార్హం. కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండగా.. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తప్ప ఇతర పార్టీల ముఖ్యనేతలెవరూ రాలేదు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, టీఎంసీ నేత నదీముల్ హక్, వీసీకే పార్టీ తమిళనాడు అధ్యక్షుడు తిరుమా వలనస్, ఆప్ నేత రాజేంద్రపాల్ గౌతమ్, అన్నా డీఎంకే ఎంపీ చంద్రశేఖర్, డీఎంకే ఎంపీ తంబీదురై హాజరయ్యారు. జేఎంఎం, ఐయూఎంఎల్ కూడా మద్దతు పలికాయి. వినుకొండలో జరిగిన రషీద్ హత్యకు సంబంధించిన వీడియోను ఆయా నేతలకు జగన్ చూపించారు. చంపిందీ, చనిపోయిందీ తమ పార్టీ నాయకుడి గ్యాంగ్ సభ్యులేననే విషయాన్ని దాచిపెట్టారు. దీనికి రాజకీయ రంగు పులిమారు. తమకు మద్దతు పలికిన నేతలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.
ఒక పక్క ఏ1 ధర్నా..
మరోపక్క ఏ2 బాధితుడి ధర్నా...
ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘ఏ1’ వైఎస్ జగన్ ధర్నా చేస్తుండగా... మరోపక్క ఏ2 విజయసాయి రెడ్డి బాధితుడు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ధర్నాకు దిగారు. జగన్ ధర్నాకు హాజరైన వాళ్లు... మదన్‌మోహన్ ధర్నా గురించి కూడా చర్చించుకున్నారు. ఇంకా చెప్పాలంటే... బుధవారం జంతర్ మంతర్‌లో ఏపీలో శాంతిభద్రతల అంశం కంటే విజయసాయి రెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగింది.
అఖిలేశ్ కారుకు అడ్డంకులు
ధర్నా వేదిక వద్దకు అఖిలేశ్ యాదవ్‌ను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీసుకుని వచ్చారు. సమన్వయ లోపంకారణంగా వారి కారును కూడా చాలా సేపు లోపలికి వెళ్లనివ్వలేదు. అఖిలేశ్ మాట్లాడి తిరిగి వెళుతున్న సమయంలో... మాజీ జడ్జి రామకృష్ణతోపాటు మరికొందరు ఆయనను అడ్డుకున్నారు. ‘‘ఇదో బోగస్ ధర్నా. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. అసత్యాలు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారు. దీని గురించి మీరు మరోసారి ఆలోచించాలి’’ అని రామకృష్ణ సూటిగా చెప్పారు. ఒకసారి ఆఫీసుకు వస్తే కూలంకషంగా మాట్లాడుకుందాంటూ అఖిలేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధర్నాకు కూడా తప్పుడు మార్గాల్లో అనుమతి తీసుకున్నారని రామకృష్ణ ఆరోపించారు. జగన్ పేరుమీద దాఖలు చేసిన అనుమతి పత్రాన్ని పోలీసులు తిరస్కరించారన్నారు.