ముడుపుల ముడి వీడింది!
ABN, Publish Date - Nov 22 , 2024 | 05:31 AM
పోర్టులు అదానీకి సమర్పయామి! ప్రాజెక్టులూ అదానీకే అప్పగింత! చివరికి... సోలార్ పవర్ కూడా అదానీదే! జగన్ జమానాలో అదానీదే రాజ్యం! ఇప్పుడు వీరిద్దరి అక్రమ బంధాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటపెట్టాయి.
మూడేళ్ల కిందటే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
ఇప్పుడు నిర్ధారించిన అమెరికా సంస్థలు
‘ఆంధ్రజ్యోతి’ అక్షర సత్యం
నాడు సౌర విద్యుత్‌పై ‘సెకీ’ టెండరు దక్కించుకున్న అదానీ
ధర చూసి రాష్ట్రాలు బెంబేలు.. విద్యుత్ కొనుగోలుకు ముందుకురాని డిస్కమ్‌లు
రాష్ట్రాలన్నీ గాలించినా దక్కని ఫలితం.. కానీ ఏపీలో తలుపులు తెరిచిన జగన్
రాష్ట్ర టెండర్లు రద్దు చేసి ‘సెకీ’కి సై.. అదానీ కలిసిన 4 రోజులకే కేబినెట్‌లో ఓకే
ఇవే వివరాలతో అదానీపై అమెరికాలో కేసు
అదానీ పంచిన లంచాల్లో ఏపీ వాటా రూ.1,750 కోట్లు
అదానీ గ్రూప్ పంచిన 2,029 కోట్ల లంచాల్లో నాటి జగన్ సర్కారు వాటానే రూ.1,750 కోట్లు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ ద్వారా 7వేల మెగావాట్ల అదానీ విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున లంచం! 7వేల మెగావాట్లకు.. రూ.1,750 కోట్లు! ఇది.. అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చిన లెక్క.!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పోర్టులు అదానీకి సమర్పయామి! ప్రాజెక్టులూ అదానీకే అప్పగింత! చివరికి... సోలార్ పవర్ కూడా అదానీదే! జగన్ జమానాలో అదానీదే రాజ్యం! ఇప్పుడు వీరిద్దరి అక్రమ బంధాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటపెట్టాయి. కానీ... ‘ఆంధ్రజ్యోతి’ మూడేళ్ల కిందటే... 2021 సెప్టెంబరు 22వ తేదీనే తెరవెనుక గుట్టు రట్టు చేసింది! 12వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు ఏ రాష్ట్రమూ ముందుకు రాని పరిస్థితుల్లో... దిక్కుతోచని స్థితిలో ఉన్న ‘అదానీ’కి జగన్ తలుపులు తెరవడం వెనుక జరిగిన తతంగం ఇప్పుడు బయటపడింది. ‘‘భారత సౌర విద్యుత్ కార్పొరేషన్ (సెకీ)తో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ... అప్పటికే సౌర విద్యుత్తు ధర బాగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో అదానీ నుంచి భారీ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలేవీ ముందుకు రాలేదు.
దీంతో... అదానీ గ్రూప్ ఆయా రాష్ట్రాలకు లంచాలు ఎరవేసింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అదానీ వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాతే ఏడువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదిరింది’’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు వెల్లడించాయి.
అచ్చంగా ఇవే వివరాలతో 2021 సెప్టెంబరు 22న ‘ఆంధ్రా సూరీడు అదానీ’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ ఏడాది సెప్టెంబరు 12వ తేదీన అదానీ తాడేపల్లికి వచ్చి జగన్‌తో రహస్య సమావేశం జరిపారు. ఆ తర్వాత నాలుగు రోజులకు... అంటే సెప్టెంబరు 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘సెకీ’ ద్వారా విద్యుత్ కొనుగోలుకు ఆమోద ముద్ర పడింది. గతంలో 6600 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యూనిట్ సౌర విద్యుత్తు ధర రూ.2కు పడిపోయే అవకాశాలున్న నేపథ్యంలో... అదానీ నుంచి విద్యుత్తు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వాలేవీ ముందుకు రాలేదని ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే వెల్లడించింది. సెకీతో ఒప్పందం చేసుకుని నెలలు గడుస్తున్నా రాష్ట్రాలతో పీపీఏలు కుదరకపోవడం, ప్లాంట్ల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ రాష్ట్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఆ సమయంలో ఏపీలో ఉన్న జగన్ సర్కారు అదానీకి ‘తలుపులు’ తెరవడం వంటి వివరాలన్నీ ‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే రాసింది. వీటి వెనుక ‘ముడుపుల మూటలు’ ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు వెల్లడించాయి.
‘పవర్’ఫుల్ లంచాలు...
అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ 4 గిగావాట్లు, తాను 8 గిగావాట్లు... మొత్తం 12 గిగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్తు సరఫరాపై ‘సెకీ’తో అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఏకంగా 7వేల మెగావాట్లు కొనుగోలు చేసేందుకు జగన్ అంగీకరించడం గమనార్హం. రైతులకు 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్తు ఇవ్వడం కోసమే సెకీతో పాతికేళ్లకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని శాసనసభలో, బయటా ముఖ్యమంత్రి హోదాలో జగన్ గొప్పగా ప్రకటించారు. 2021 డిసెంబరు ఒకటో తేదీన సెకీ ద్వారా 7000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. యూనిట్ విద్యుత్తు ధర రూ.2.49. భారతదేశంలో మరే రాష్ట్రమూ ఇంత ధర చెల్లించేందుకు అంగీకరించలేదు. నిజానికి... వ్యవసాయ విద్యుత్తు పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కంపెనీ (ఏపీ రాస్కామ్)ను స్థాపించింది. సెకీతో ఈ సంస్థే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కానీ... జగన్ సర్కారు డిస్కమ్‌లను రంగంలోకి దించింది. దీని వెనుక ఏదో మర్మం దాగుందని అప్పుడే అనుమానాలు తలెత్తాయి.
కరెంటు ‘పోయింది’
సెకీతో రాష్ట్ర డిస్కమ్‌లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుకే 3000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్రానికి అదానీ సరఫరా చేయాలి. ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడలేదు.
వేల కోట్ల షాకులు...
యూనిట్ సౌర విద్యుత్తు రూ.2.49కు కొనుగోలు చేసేలా ‘సెకీ’తో ఒప్పందం కుదిరింది. దేశంలో మరే రాష్ట్రమూ ఇంత రేటు పెట్టేందుకు సిద్ధపడలేదు. అప్పటికి గుజరాత్‌కు సెకీ యూనిట్‌కు రూ.1.99కే విద్యుత్ సరఫరా చేస్తోంది. అంటే... ఏపీలో యూనిట్‌కు 50 పైసలు అదనం. పైగా... అదనంగా ఎలాంటి ట్రాన్స్‌మిషన్ చార్జీలూ ఉండబోవని నాడు జగన్ వెల్లడించారు. కానీ.. యూనిట్‌కు 80 పైసలు కట్టాల్సిందే అని ‘సెకీ’ ఇప్పుడు చెబుతోంది. దీని భారం రూ.42 వేల కోట్ల దాకా ఉంటుందని ఇంధనశాఖ చెబుతోంది.
‘అక్రమ బంధం’పై ఏపీ సీఎం సమీక్ష
‘జగన్-అదానీ’ అక్రమ బంధం అంతర్జాతీయ స్థాయిలో రచ్చకెక్కింది. ఇది రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. జగన్ సర్కారు ‘సెకీ’తో 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందంపై గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుసుకుని... తదుపరి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
Updated Date - Nov 22 , 2024 | 05:31 AM