ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Viveka Murder Case: వివేకానంద హత్య జరిగి నేటికి ఐదేళ్లు.. గొడ్డలివేటు కథలో అబ్బాయే విలన్‌!

ABN, Publish Date - Mar 15 , 2024 | 08:58 AM

సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యను నాటి విపక్ష నేత జగన్‌ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే(Chandrababu) హత్య చేయించారంటూ జగన్‌ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేకా హత్య జగన్‌కు(YS Jagan) సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలకపాత్ర పోషించింది.

YS Vivekananda Reddy

  • గొడ్డలివేటు కథలో అబ్బాయే విలన్‌.. గత ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేసుకున్న జగన్‌

  • నారాసుర రక్తచరిత్ర అంటూ బాబుపై నెపం.. అధికారంలోకొచ్చాక కేసు అటకపైకి

  • సునీత పోరాటం, సీబీఐ విచారణతోనే గుట్టు రట్టు.. తొలిసారి వైఎస్‌

  • కాంపౌండ్‌ పాత్ర వెలుగులోకి.. వైఎస్‌ అవినాశ్‌, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలపై కేసు

  • అన్నకు ఓటు వేయొద్దని ఇటీవల సునీత ప్రకటన.. రాజకీయ ప్రవేశంపై వార్తలు!

  • నేడు కడపలో ఆయన కుమార్తె సునీత ఆత్మీయ సమావేశం

(కడప–ఆంధ్రజ్యోతి): సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యను నాటి విపక్ష నేత జగన్‌ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే(Chandrababu) హత్య చేయించారంటూ జగన్‌ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేకా హత్య జగన్‌కు(YS Jagan) సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలకపాత్ర పోషించింది. దీంతో జగన్‌ సీఎం అయిన తరువాత తన చిన్నాన్న హత్య కేసు కుట్రను ఛేదించడంతోపాటు నిందితులను అరెస్టు చేయిస్తారని రెండు రాష్ట్రాల ప్రజలూ ఎదురుచూశారు. కానీ ఏమీ జరుగలేదు. వివేకా హత్యకు గురై నేటికి సరిగ్గా ఐదేళ్లు. 2019 మార్చి 15న పులివెందులలోని ఆయన స్వగృహంలో అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. మళ్లీ ఎన్నికలు కూడా వచ్చేశాయి. కానీ హంతకులను జగన్‌ ప్రభుత్వం బోనెక్కించలేకపోయింది. పైగా సొంత బాబాయి హత్యకేసునే అటకెక్కించే ప్రయత్నం జరిగింది. హత్య వెనుక వైఎస్‌ కాంపౌండ్‌ హస్తం ఉండటమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యం. వివేకా హంగులు, ఆర్భాటాలకు దూరంగా. చాలా సాదాసీదా జీవనాన్ని గడిపేవారు. తన అన్న రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ అధికారాన్ని తలకెక్కించుకోలేదు. తమ్ముడిని రాజశేఖర్‌రెడ్డి గౌతమబుద్ధుడుగా పిలుచుకునేవారు. వివేకాను పార్టీలకతీతంగా అందరూ అభిమానించేవారు.

హత్య కేసులో ఎన్నెన్ని ట్విస్టులో..

వివేకా హత్యకు చంద్రబాబు, లోకేశ్‌ సూత్రధారులని, అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో హత్య చేయించారంటూ అప్పట్లో వైఎస్‌ జగన్‌.... గవర్నరుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని జగన్‌ అండ్‌ కో డిమాండ్‌ చేశారు.జగన్‌ సీఎంగా అదే ఏడాది మే 30న ప్రమాణం చేశారు. నాటి నుంచి.. ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ పోయింది. దర్యాప్తు కోసం టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన సిట్‌ను మార్చివేశారు. అభిషేక్‌ మహంతి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేయగా.. ఆయన సెలవుపై వెళ్లారు. 2019 సెప్టెంబరులో కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అన్బురాజన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసినా కేసు ముందుకు పోలేదు. ప్రతిపక్ష నేత హోదాలో సీబీఐ విచారణ కోరిన జగన్‌.. సీఎం అయ్యాక కోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆయన తీరులో తేడా రావడంతో వివేకా కుమార్తె డాక్టరు సునీత సీబీఐ విచారణ కోరారు. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హత్యకు ఎక్కడ నుంచి ఫాలో అప్‌ చేశారు లాంటివన్నీ బయటపడ్డాయి. వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్కెచ్‌ వైఎస్‌ కాంపౌండులోనే జరిగిందని సీబీఐ తేల్చింది. గూగుల్‌ టేకౌట్‌ ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను బాహ్య ప్రపంచానికి చూపించింది. జగన్‌కు వరుసకు తమ్ముడు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, వైసీపీ రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు పేర్కొంటూ వారిపై కేసు నమోదు చేసింది. ఇది పెను సంచలనంగా మారింది. కడప ఎంపీ సీటు, ఆధిపత్యం కోసమే వివేకాను లేపేశారని విచారణలో తేలింది.

వేధించినా.. వేటాడినా.. వెనుదీయని దస్తగిరి..

ఈ కేసులో సీబీఐ 8 మందిని అరెస్టు చేసింది. వారిలో ఏ–4గా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి వివేకా వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. హత్యకేసు విచారణ ఇంతవరకు వచ్చిందంటే కారణం దస్తగిరి. ఇతను అప్రూవర్‌గా మారడంతో హత్యకు సంబంధించి ఒక్కో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పులివెందుల వైసీపీ నేతలు ఇతనిపై గురిపెట్టారంటారు. ఎలాగైనా ఇతడిని దారికి తెచ్చుకోవాలని పోలీసులతో కేసులు పెట్టించారంటారు. ఎర్రగుంట్లలో ఇతనిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దాదాపు నాలుగు నెలలు జైలులో ఉంచారు. చివరకు హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నాడు. ఒక కేసులో బెయిల్‌ తెచ్చుకున్నా మరోకేసు నమోదు చేశారు. దానికీ బెయిల్‌ రావడంతో ఇంటికి వచ్చాడు. అయితే తాను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వచ్చి తనను బెదిరించాడని, రాజీకి రావాలంటూ రూ.20 కోట్లు ఆఫర్‌ చేశాడని దస్తగిరి ఇటీవల వెల్లడించడం పెను సంచలనం రేపింది. తనను నేరస్థుడిగా కాకుండా సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పై ఇటీవల తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై సీబీఐ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. తీర్పు రిజర్వ్‌లో ఉంది.

అవినాశ్‌ అరెస్టును ఆపడానికి..

అవినాశ్‌రెడ్డి అరెస్టు దాకా వ్యవహారం రావడంతో అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టించారు. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు దాదాపు నాలుగు రోజులు వైసీపీ శ్రేణులను మోహరించారు. సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడితేనే అర్ధరాత్రిపూట వెళ్లి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేసే పోలీసులు.. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకపోవడంతో.. దీని వెనక ఎవరున్నారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. చివరకు అవినాశ్‌రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ వారు అరెస్టు చేసి అదేరోజు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో అప్రూవర్‌ దస్తగిరి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. రెండు రోజుల క్రితం ఏ–5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

సునీత అలుపెరగని పోరాటం..

తండ్రి హత్యకేసులో నిందితులు ఎవరో తేలేందుకు సునీత అలుపెరగని పోరాటం చేశారు. కేసు విచారణకు సొంత అన్న అయిన సీఎం జగన్‌ సహకరించకపోవడంతో ఒంటరి పోరు మొదలుపెట్టారు. విచారణ ముందుకు వెళ్లకుండా జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆమె భావించారు. అయినా మొక్కవోని ధైర్యంతో కడప బిడ్డగా ముందుకు వెళ్లిన తీరు హ్యాట్సాప్‌ అంటున్నారు. ఈ కేసును ఇంతటితో వదులుకోలేదంటే నీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించినా, డోంట్‌ కేర్‌ అంటూ ముందుకు అడుగులు వేశారు. తన తండ్రి స్మారకార్థం ఆమె శుక్రవారం కడప జయరాజ్‌ గార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశం సునీత ఏర్పాటుచేశారు. ఇప్పటికే వివేకా అనుచరులకు ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. ఈ కార్యక్రమానికి సునీతతోపాటు భార్య సౌభాగ్యమ్మ, వివేకానంద కుటుంబసభ్యుల ముఖ్యులు హాజరు కానున్నారు. వివేకా కుటుంబం నుంచి ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మా నాన్న వివేకానందరెడ్డి హత్యకు ప్రజాతీర్పుతోనే నిజమైన న్యాయం జరుగుతుంది. జగన్‌ ప్రభుత్వంలో హత్యారాజకీయాలు ఎక్కువ. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మా కుటుంబానికి న్యాయం జరగదు. వంచన, మోసాలకు పాల్పడిన మా అన్న జగన్‌ పార్టీకి ఓటు వేయవద్దు’’

– ఇటీవల ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో సునీత వ్యాఖ్యలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 08:58 AM

Advertising
Advertising