Andhra Pradesh: కాకినాడలో మూడు గంటలపాటు కుండపోత
ABN, Publish Date - May 25 , 2024 | 04:53 AM
వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది.
కాకినాడ, మే 24 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది. దీంతో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఏకంగా 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈనేపథ్యంలో ఈనెల 27వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకువెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 35 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని చెప్పారు.
Updated Date - May 25 , 2024 | 06:59 AM