AP Govt : బియ్యం దొంగల భరతం పడదాం !
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:52 AM
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష...
అక్రమాల కట్టడిపై మంత్రి వర్గ ఉపసంఘం
సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో నిర్ణయాలు
అక్రమార్కులు, వారికి సహకరించిన వారి వివరాలు ఇవ్వండి
కాకినాడ పోర్టు అధికారిగా ఐపీఎస్
ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
స్మగ్లింగ్‌పై సీనియర్ ఐపీఎస్‌తో కమిటీ
వ్యవస్థీకృత నేరంగా బియ్యం అక్రమ రవాణా
ఎగుమతి చేసిన కీలక వ్యక్తులపై చర్యలు
వారి అక్రమాస్తులు కూడా స్వాధీనం
పేదల బియ్యం వారికి చేరాలి. లేదా ప్రభుత్వానికి ఉపయోగం కలగాలి. మధ్యలో మాఫియా పాలైతే ఎలా? కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంతోపాటు ఆఫ్రికా దేశాలకు బియ్యం తీసుకెళుతున్న అగర్వాల్, పోర్టులో అంతా మేనేజ్ చేస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆధారాలు, అవకాశాలను పరిశీలించాలి!
- చంద్రబాబు
అమరావతి/కాకినాడ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష... అంతకుముందే మంత్రివర్గ ఉపసంఘం భేటీ! ఇలా ఒకే రోజు వరుస పరిణామాలు వేగంగా జరిగాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం ఎగుమతుల వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం స్మగ్లింగ్‌తో అక్రమంగా ఆర్జించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే దిశగా దృష్టిసారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఆయనతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సమావేశంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా జరుగుతున్న రేషన్ బియ్యం ఎగుమతుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు ఇప్పుడు రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం వంటి పోర్టులకు మారుతున్నట్లు వార్తలు వస్తుండటంతో అక్కడ కూడా తనిఖీలు పెంచాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టును ఇకపై రాష్ట్ర పోలీసుల పరిధిలోకి తేవాలని, అక్కడ ప్రత్యేకంగా ఒక పోర్టు పోలీస్ స్టేషన్ నెలకొల్పాలని తీర్మానించారు.
సీఎం చేతికి చిట్టా...
పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం చంద్రబాబు సీఎస్ నీరభ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ అధిపతి మహేశ్‌చంద్ర లడ్డాతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని ఆదేశించారు. కాకినాడ పోర్టు నుంచి లక్షలాది టన్నుల రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తూ, వేలకోట్లు దోచుకుంటున్న మాఫియా సంగతి తేల్చేందుకు సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిని పోర్టు సీఈవోగా నియమిస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఐదేళ్లుగా స్మగ్లింగ్ చేసిన వారి జాబితాతో పాటు జిల్లాలవారీగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారుల వివరాలివ్వాలని సీఎం సూచించారు. ఏపీ పోలీసుశాఖలో అంతర్భాగమైన మెరైన్ పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేసి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కోస్ట్‌గార్డు విభాగంతో సమన్వయం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి భద్రత సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ అంశంపై ఒక నివేదిక సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపాలని సూచించారు. ఇప్పటి వరకూ సేకరించిన సమాచారాన్ని, ఎమ్మెల్యేల పాత్ర, అధికారుల అవినీతి, మాఫియా కింగ్ పిన్‌ల వివరాలను ఈ సందర్భంగా డీజీపీ వెల్లడించారు. నిఘా అధిపతి త్వరలో నివేదిక అందజేస్తారని చెప్పినట్లు తెలిసింది.
వ్యవస్థీకృత నేరంగా...
రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందుకోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని, ఇక మీదట అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఉన్న 5 వేర్‌హౌసుల్లో సార్టెక్స్ మిషన్లను ఎలా ఏర్పాటు చేశారని మారిటైం బోర్డు అధికారులు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, శాంతిభద్రతల ఐజీ, సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ, మారిటైం బోర్డు సీఈవో, కస్టమ్స్ అధికారి, కాకినాడ పోర్టు అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
15 రోజుల్లో నామినేటెడ్ నాలుగో జాబితా
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి నాలుగో జాబితా మరో పదిహేను రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య భేటీ సందర్భంగా దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రాని కొందరు ఆశావహులకు కూటమి పార్టీలు నామినేటెడ్ పదవులపై హామీలు ఇచ్చాయి. వారికి ఆ మేరకు చోటు కల్పించడంపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పనుల పురోగతిపై కూడా వారు చర్చించారు. రాజధాని అమరావతిలో ఈ నెల 15 తేదీ నుంచి పనులు ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల తాను ఢిల్లీలో ప్రధానిని, వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన విషయాలను పవన్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల మరణించడంపై పవన్ విచారం వ్యక్తం చేశారు.
నౌక స్వాధీనానికి కసరత్తు
కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా నౌకను సీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చట్టపరంగా నౌకను స్వాధీనం చేసుకునే మార్గాలను అన్వేషిస్తోంది. స్మగ్లింగ్ కారణంతో కస్టమ్స్ అధికారులు నౌకను సీజ్ చేసే అధికారం ఉంది. కానీ రేషన్ బియ్యం స్మగ్లింగ్ పరిధిలోకి రాని నేపథ్యంలో కస్టమ్స్ అధికారుల నుంచి సహకారం కొరవడింది. దీంతో అడ్మిరాలిటీ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖ ద్వారా కేసు వేసి సీజ్‌కు ప్రయత్నించవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సోమవారం రంగంలోకి దిగారు. పౌర సరఫరాలు, పోర్టు అధికారులతో చర్చించారు.
కాకినాడ ఎస్పీ తీరుపై చర్చ
కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను బదిలీ చేయాలని పవన్ సీఎం వద్ద పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను నౌక తనిఖీకి వస్తున్నట్లు తెలియగానే ఎస్పీ సెలవుపై వెళ్లారని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయడానికి ఎస్పీ ప్రయత్నించలేదని, పైగా ఎన్నికల కోడ్ పేరుతో తనను నౌక వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కలెక్టర్ వచ్చినా ఎస్పీ రాలేదని ముఖ్యమంత్రికి ఆయన చెప్పినట్లు సమాచారం. కాకినాడ ఎస్పీ బదిలీపై ఆలోచించి చెబుతానని సీఎం అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, పవన్ సీఎంను కలవడానికి ముందు కాకినాడ ఎస్పీ తన వాదనను సీఎంవోకు వినిపించినట్లు తెలిసింది. తాను వారం నుంచి సెలవులో ఉన్నానని ఆయన చెప్పారు.
Updated Date - Dec 03 , 2024 | 03:55 AM