Vijayawada: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ప్రియుడి కోసం యువతి ఎంత పని చేసిందంటే..
ABN, Publish Date - Nov 30 , 2024 | 09:49 AM
విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి చిట్టినగర్‌కు చెందిన ఓ యువతి (19) చదువు మధ్యలో ఆపేసి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఆమె సరదా కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది.
విజయవాడ: నగరంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ విషాదాంతంగా ముగిసింది. నగరానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అతని కోసం యువతి పరితపించింది. ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. అతని మోజులో పడి ఇంట్లో నుంచి పారిపోయింది. చివరికి ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.
విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి చిట్టినగర్‌కు చెందిన ఓ యువతి (19) చదువు మధ్యలో ఆపేసి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే ఆమె సరదా కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందులో యువతికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రతి రోజూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేవారు. అలాగే చాటింగ్ చేసుకునేవాళ్లు. వారి మధ్య ప్రేమ బాగా ముదిరిపోయింది. ముఖ్యంగా యువతి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. విషయాన్ని ఇంట్లో చెప్పింది. అయితే సోషల్ మీడియాలో పరిచయం కావడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అలాంటి వ్యక్తులను ఎలా నమ్మేదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది.
అయితే అతనే కావాలంటూ యువతి భీష్మించింది. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఈనెల 24న కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. అదే రోజు డాక్టర్లు యువతిని డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. తన ప్రేమను అడ్డుకుంటున్నారని యువతి కుమిలిపోయింది. మరుసటి రోజు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. చివరికి కాకినాడ జిల్లా తునిలో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఈనెల 26రాత్రి అందరూ నిద్రిస్తుండగా మళ్లీ పారిపోయింది. అయితే ఈసారి ఆమె ప్రాణాలతో తిరిగి రాలేదు.
కుమార్తె కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు ఆమె కోసం నగరం మెుత్తం మళ్లీ గాలించారు. అయితే బుధవారం రోజు పాండు అనే వ్యక్తి యువతి తండ్రికి ఫోన్ చేశాడు. పాత పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపం ఏలూరు కాలువలో ఆమె దూకినట్లు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబం యువతి కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఆమె ఆచూకీ ఏమాత్రం తెలియరాలేదు. దీంతో వెంటనే గవర్నర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రెండ్రోజుల తర్వాత నేడు ఆమె శవమై కనిపించింది. రామవరప్పాడు ఏలూరు కాలువకట్ట వద్ద పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - Nov 30 , 2024 | 09:49 AM