AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక.. కొత్త అధ్యక్షుడు ఎవరంటే?
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:16 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించారు. సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కార్ రావు వర్గం మీడియా సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(APGEA)లో చీలిక ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించారు. సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కార్ రావు వర్గం మీడియా సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు. సూర్యనారాయణ ప్రవర్తన వల్ల సంఘంపై అనేక కేసులు పడ్డాయని, మాట్లాడితే షోకాజ్ నోటీసు ఇవ్వడం, రాజీనామా చేయించడం సర్వసాధారణంగా ఆయన మార్చేశారని మండిపడ్డారు.
తనను కూడా అప్రజాస్వామికంగా బయటకు పంపారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఉద్యోగినైన తనను అనేక సార్లు తీవ్రంగా అనుమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్లనాగసాయిని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సంఘం తాత్కాలిక నూతన అధ్యక్షుడిగా డి.శ్రీకాంత్‌ను నియమిస్తున్నట్లు ఆస్కార్‌రావు చెప్పారు. ఏపీజీఈఏకు మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సుబ్బరాయన్‌కు సూర్యనారాయణ వెన్నుపోటు పొడిచారు..
ఈ సందర్భంగా APGEA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడుతూ.. 2010లో సుబ్బరాయన్ ఈ సంఘాన్ని ప్రారంభించారు. సంఘంలో చేరి సుబ్బరాయన్‌కు సూర్యనారాయణ వెన్నుపోటు పొడిచారు. 2019వరకు సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. వైసీపీ నాయకులు ఆదేశాల ప్రకారం వారి గెలుపు కోసమే పనిచేసినట్లు స్వయంగా సూర్యనారాయణే చెప్పుకున్నారు. ఇప్పుడు మరలా ఎన్డీయే అధికారంలోకి రాగానే.. టీడీపీ గెలుపు కోసం పనిచేశానని చెబుతున్నారు. అహంభావంతో తాను దైవాంశ సంభూతుడిననే ట్రాన్సులోని ఆయన వెళ్లిపోయారు. సంఘం రూల్స్ విస్మరించి జిల్లాల నాయకత్వాలను మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కె.ఆర్.సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి కాపాడుకుంటున్నట్లు ఆస్కార్ రావు వెల్లడించారు.
సంఘం నిధులు దుర్వినియోగం..
ఏపీజీఈఏ సంఘానికి సంబంధించిన నిధులను గుండ్ల నాగసాయితో కలిసి సూర్యనారాయణ వాడుకున్నారు. గుండ్ల నాగసాయిని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నాం. సూర్యనారాయణ అవినీతి, అక్రమాల వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అతను గతంలోనూ సస్పెన్షన్‌కు గురైన వ్యక్తి. ఆయనికి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే రికార్డులు తీసుకుని నాతో చర్చకు రావాలి. ఆయనపై జీఏడీకీ ఫిర్యాదు చేశాం. మా సంఘం రెండుగా విడిపోతే ప్రభుత్వ గుర్తింపు కోల్పోతుంది. 90శాతం సభ్యులు మాతోనే ఉన్నారు. గుర్తింపు కోల్పోకుండా సంఘాన్ని కాపాడుకుంటామని ఆస్కార్ రావు తెలిపారు.
పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు అన్యాయం చేసిన ద్రోహి సూర్యనారాయణ అని తాత్కాలిక నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని వ్యక్తిగత స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 13జిల్లాల శాఖల నాయకులే APGEA సంఘాన్ని నడిపిస్తారని చెప్పారు. సూర్యనారాయణ పెట్టిన జిల్లా నాయకులతో సంఘానికి ఎలాంటి సంబంధం లేదని శ్రీకాంత్ తెలిపారు.
Updated Date - Jul 27 , 2024 | 03:16 PM