Pawan Kalyan: వైసీపీపై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ABN, Publish Date - Nov 19 , 2024 | 08:59 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు.
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం (YSRCP govt) తాగునీటి సరఫరాలో పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్లే ఏపీ ప్రజలు డయేరియా వంటి రోగాల బారిన పడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. జగన్ సర్కార్‌లో పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపకపోవడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామానికి కనీసం రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయారని పవన్ మండిపడ్డారు.
గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చలేకపోయారని ఉప ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ప్రతి గ్రామానికీ రూ.4 లక్షలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అందేదని ఆయన చెప్పుకొచ్చారు. అలా చేయకుండా రంగు మారిన నీటినే ప్రజలకు సరఫరా చేసి వారి ఆరోగ్యంతో ఆటలాడారని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ఏపీ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించడంపై ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ మేరకు గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు మార్చామని, అందుకు రూ.3.3 కోట్ల వ్యయం అయిందని ఆయన తెలిపారు. ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం, ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడవద్దని అధికారులను ఆదేశించినట్లు పవన్ చెప్పారు.
గత పాలకులు నిర్లక్ష్యపూరిత వ్యవహారాల మూలంగానే డయేరియా ప్రబలి అనేక మంది ప్రాణాలు పోయాయని ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఎప్పటికప్పుడు నిర్దేశిత కాల వ్యవధిలో నిర్వాహణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు సరఫరా అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఇందుకు నిర్మాణాత్మకంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గుడివాడ నియోజకవర్గంలో చేసిన పనుల విధానాన్ని మోడల్‌గా తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం.. శాసనసభలో సీఎం ప్రకటన
Pawan Kalyan: మహిళలు, యువతుల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్..
Updated Date - Nov 19 , 2024 | 09:03 PM