Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..
ABN, Publish Date - Dec 16 , 2024 | 03:04 PM
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
కృష్ణా: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె గత శుక్రవారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి బదిలీ చేశారు. కాగా, నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల నుంచి సీడీ ఫైల్ రాకపోవటంతో విచారణను ఈనె 19కి వాయిదా వేసింది. అయితే గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆయన కుటుంబ సభ్యుల కోసం బందరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాని సన్నిహితుల కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆచూకీ తెలిపితే బహుమతి..
మరోవైపు కనిపించకుండా పోయిన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకీ తెలిపితే రూ.1,116 బహుమతిగా ఇస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకూ రెచ్చిపోయిన వారిద్దరూ సైలెంట్ అయిపోయారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ విధానాలు, పోకడలు నచ్చకే ఆ పార్టీని అనేక మంది నేతలు వీడుతున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.
ప్రజాధనం మేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హాజరుకాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రతినెలా వారు రూ.1.75 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జీతం తీసుకుంటున్నా వారు ప్రజల గురించి ఏ ఒక్కరోజూ మాట్లాడలేదన్నారు. అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలను మేకలుగా పరిగణిస్తామని, వైసీపీలో 11మేకలు ఉన్నాయని, అవి ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని బుద్దా ఎద్దేవా చేశారు. వాటిలో పెద్ద మేక ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని, గతంలో సీఎంగా పనిచేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పటంతో బెంగళూరుకు పారిపోయాడని ఆయన విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు రాకుండా ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..
CM Chandrababu: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక భేటీ
Updated Date - Dec 16 , 2024 | 03:18 PM