AP news: సీఎం చంద్రబాబు పర్యటన.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు..
ABN, Publish Date - Dec 12 , 2024 | 08:37 PM
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
విజయవాడ: డిసెంబర్ 13న జరిగే స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి విజయవాడ నగరం వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని రేపు (శుక్రవారం) ఇందిరా గాంధీ స్టేడియంలో అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని స్వర్ణాంధ్ర విజన్-2047కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. పెద్దఎత్తున నిర్వహించే కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సుమారు 500 బస్సులు ఏర్పాటు చేసి వారిని సభా స్థలానికి అధికారులు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. విజయవాడలోకి భారీ వాహనాలు రాకుండా నగరం వెలుపల నుంచే వాటి రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు అవనిగడ్డ మీదుగా మళ్లించనున్నట్లు చెప్పారు. చెన్నై- హైదరాబాద్ వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను మైలవరం, జి.కొండూరు, నూజివీడు మీదుగా మళ్లించనున్నారు. విజయవాడలోకి వచ్చే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మహాత్మా గాంధీ రోడ్‌లో బస్సులు, ఆటోలకు అనుమతి లేదని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుమతించిన వాహనాలు తప్పితే ఇతర వాహనాలకు ఎంజీ రోడ్డులోకి అనుమతి లేదని అధికారులు చెప్పారు. సభా స్థలం ఇందిరా గాంధీ స్టేడియానికి వచ్చే వాహనాల కోసం 24 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Updated Date - Dec 12 , 2024 | 08:37 PM