మంత్రి టీజీ భరత్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:24 AM
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా అమాత్య హోదాలో శుక్రవారం కర్నూలుకు వచ్చిన టీజీ భరత్‌కు టీడీపీ శ్రేణులు, నగర ప్రజలు ఘనస్వాగతం పలికారు.
మంత్రి హోదాలో తొలిసారిగా కర్నూలుకు రాక
స్వాగతం పలికన వేలాదిమంది ప్రజలు, టీడీపీ శ్రేణులు
జన్మనిచ్చిన జిల్లా రుణం తీర్చుకుంటా : టీజీ బరత్
కర్నూలు(అర్బన్), జూన్ 14: రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా అమాత్య హోదాలో శుక్రవారం కర్నూలుకు వచ్చిన టీజీ భరత్‌కు టీడీపీ శ్రేణులు, నగర ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు నగర శివారులో గజమాలతో స్వాగతం పలికారు. సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి చీరంజీవిపార్కు, ఎన్‌ఆర్‌పేట, ఎస్‌బీఐ సర్కిల్, చిల్డ్రన్స్ పార్కు, గాంధీ నగర్, రాజవీహర్, బుధవారపేట, కలెక్టరేట్ మీదుగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా మంత్రి టీజీ భరత్ చేరుకున్నారు. దారి పొడవునా బాఽణసంచా పేలుస్తూ, గజ మాలలతో సత్కరిస్తూ టీజీ భరత్‌కు ఆహ్వానం పలికారు.
నమ్మకంతో పరిశ్రమల శాఖ ఇచ్చారు : టీజీ భరత్
తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు, వాణిజ్య శాఖను కేటాయించారని మంత్రి టీజీ భరత్ అన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజులతో కలిసి ఆయన మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేవాలయం లాంటి జిల్లా పార్టీ కార్యాలయం చేరుకుని పాలన అక్కడి నుంచే ప్రారంభించాలని ఇక్కడికి వచ్చానన్నారు. జన్మనిచ్చిన జిల్లా రుణం తీర్చుకుంటానని తెలిపారు. కర్నూలుతో పాటు రాష్ట్రానికి సేవలు చేసే అదృష్టం తెలుగుదేశంపార్టీ కల్పించిందన్నారు. ప్రమాణ స్వీకార వేదికపై ప్రఽధాని మోదీకి చంద్రబాబు నాయుడు తనను పరిచయం చేయడం ఎంతో అదృష్టంగా భావించానన్నారు. దేశంలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు పరుగులు తీస్తున్నారని, ఆ పరిస్థితులు రాష్ట్రానికి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ఇక పుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోస్టల్ ఏరియాలో ఉన్నాయని, ఆక్వారైతల కష్టాలు తనకు తెలుసునని, దగ్గరుండి చూశానన్నారు. వారికి చేయూత ఇస్తూ ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు, కల్పించడంతో పాటు నైట్ పార్కింగ్ వ్యవస్థను కల్పించేందుకు ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఇప్పటికే చర్చించానన్నారు. కర్నూలు నగరానికి చుట్టు హంద్రీ, తుంగభద్ర నదులున్నప్పటికి తాగునీటికి ప్రజలు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, ఈ సమస్య పరిష్కారానికి గతంలోనే తన తండ్రి టీజీ వెంకటేష్ చెక్ డ్యామ్ ప్రతిపాదన పెడితే దాన్ని గత ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల నాగేంద్ర, వి. హనుమంతరావు చౌదరి, డి.జేమ్స్, బాబు రాజు, జనసేన నాయకులు అర్షద్ తదితరులు పాల్గొన్నారు.