Minister Ravi Kumar: ఏపీ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష..
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:17 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో అమరావతి నుంచి మంత్రి వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై గొట్టిపాటి ఆరా తీశారు.
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో అమరావతి నుంచి మంత్రి వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై గొట్టిపాటి ఆరా తీశారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం, సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రవికుమార్ సూచనలు చేశారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని, కావున తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. వానల దెబ్బకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే వృక్షాలు నెలకొరిగిన ప్రాంతాల్లోనూ సహాయక చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను హుకుం జారీ చేశారు. విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున్న ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి గొట్టిపాటి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకున్న ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామస్థులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షాలకు పలు ఏపీ జిల్లాల్లో పరిస్థితి ఇది..
వర్షాలకు దెబ్బకు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. దీంతో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 365అడుగులకు తాండవ జలాశయం నీటిమట్టం చేరుకుంది. తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రవాహం ప్రవహిస్తుండడంతో10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లాలో వరినాట్లు కొట్టుకుపోయి రైతులు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లా రామరాజుపాలెం వద్ద వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించి కేడీపేట-చింతపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వట్టిగెడ్డ జలాశయం పొర్లుకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చింతూరు-కుయుగురు మధ్య వంతెన పైనుంచి వాగు ప్రవహించి ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. పులిచింతల ప్రాజెక్టుకు సైతం భారీగా నీరు చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 100అడుగులకు చేరుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వరిపంట నీట మునిగింది. కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఎప్పుడు వర్షాలు ఆగిపోతాయా అంటూ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Updated Date - Jul 20 , 2024 | 03:17 PM