Nadendla Manohar : సీఐడీకి రేషన్ మాఫియా కేసు
ABN, Publish Date - Jun 30 , 2024 | 04:10 AM
‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.
కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు
భారీగా బియ్యం ఎగుమతులు
వేల కోట్ల కుంభకోణం వెనుక
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి: మంత్రి నాదెండ్ల
2వ రోజు కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఆకస్మిక తనిఖీలు
రెండు రోజుల్లో 12,915 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్
కాకినాడ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది. కాకినాడ నుంచే రేషన్ మాఫియా ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రెండోరోజు శనివారం కాకినాడ పోర్టులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాలో వివిధ పేద దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి రూ.వేల కోట్లు సంపాదించారు. రెండు రోజులపాటు వివిధ బియ్యం గోదాములు తనిఖీలు చేసి 12,915 టన్నులు బియ్యాన్ని సీజ్ చేశాం. లావన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్‌పోర్ట్సు, విశ్వప్రియ, సరళ ఫుడ్స్, సార్ట్‌క్స్ ఇండియా, వీఎస్ రాజు, అశోకా, హెచ్1 గోదాముల నుంచి బియ్యం సీజ్ చేశాం. ఈ రేషన్ మాఫియాను పూర్తిగా చేధించే దిశగా సీఐడీకి అప్పగిస్తాం. సీఐడీ ద్వారా ఈ మాఫియా అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పేదల బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ రూ.వేల కోట్లు సముపార్జించిన వారిని వదిలిపెట్టబోం. వ్యవస్థీకృత మాఫియా ఆటకట్టిస్తాం. యాంకరేజ్ పోర్టులో షిప్పింగ్ పనులను నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించాం. పోర్టు అధికారులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టిస్తున్నాం. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల అప్పులు మిగిలాయి. రైతులకు రూ.1,600 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉండగా తొలిదఫా రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తాం. నాలుగైదు రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతాయి’ అని వివరించారు. తనిఖీల సందర్భంగా కీలక సమచారంపై దృష్టి సారించని పోర్టు అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated Date - Jun 30 , 2024 | 04:13 AM