Prakasam Barrage : కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్
ABN, Publish Date - Sep 13 , 2024 | 03:08 AM
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది.
బోట్ల తయారీలో మందపాటి రేకు వాడకం
గురువారం పై భాగం మాత్రమే కట్ చేసిన సిబ్బంది
నీళ్లలో బోటు కటింగ్‌కు ఎక్కువ సమయం
బోటును రెండు ముక్కలు చేసి,
రోప్‌లతో కట్టి వేరు చేయాలనే యోచన
కాకినాడ నుంచి మరో బృందం రాక
విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజురోజుకూ ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది. బుధవారం రాత్రికి పైకికనిపిస్తున్న రెండు బోట్లలో ఒక బోటునైనా ముక్కలు చేయాలని సీ లయన్ కంపెనీ, బెకమ్ కంపెనీ ఇంజనీర్లు భావించారు. కానీ, ఇది సాధ్యం కాలేదు. నీళ్లలో బోటు కటింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది. గురువారం ఉదయం బోటు పైభాగాన్ని కట్ చేశారు. ఈ బోట్ల తయారీకి బాగా మందపాటి ఇనుప రేకును ఉపయోగించారు. 9మీటర్ల మేర రెండు వరుసల్లో కలిపి 18 మీటర్ల రేకును కట్ చేయాలి. నీటిలో మునిగిఉన్న వైపు భాగాన్ని కూడా కలుపుకుంటే మరింత ఎక్కువే కట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న భాగం కటింగ్ పూర్తయింది.
నీళ్లలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం కష్టంగామారింది. డైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నారు. ప్రస్తుతం అడుగు నుంచి కటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో బోటును రెండు ముక్కలు చేయాలన్న నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి, అటు నదికి ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్‌హౌస్ వైపు నుంచి ఐరన్ రోప్‌లు ఏర్పాటు చేసి ఆ రెండు ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కాకినాడ నుంచి పదిమందితో కూడిన రిగ్గింగ్ టీమ్ విజయవాడకు చేరుకున్నారు.
పాపికొండల్లో కచ్చులూరు వద్ద బోటు నీటమునిగినప్పుడు కీలకంగా పనిచేసిన అబ్బులు టీం ఇక్కడకు చేరుకుంది. నీళ్లలోని బోట్లను లాగడంలో ఈ బృందానికి మంచి నైపుణ్యం ఉంది. మోడల్ గెస్ట్ వద్ద గల ఘాట్‌పై భారీ రోప్‌ను ఏర్పాటు చేసి ముక్కలైన బోటు భాగాన్ని లాగుతారు. ఈ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మొదలవుతుందని భావిస్తున్నారు. ఒక్క బోటు కటింగ్‌కు రెండు రోజుల సమయం పట్టింది. బ్యారేజీ వద్ద మొత్తం మూడు బోట్లు ఉన్నందు వారం రోజుల వరకు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
Updated Date - Sep 13 , 2024 | 03:08 AM