వైసీపీకి షాక్!
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:30 AM
సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాగులుప్పలపాడు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

ఎన్‌జీపాడు మండలంలో భారీగా టీడీపీలో చేరికలు
సీనియర్ నేత పున్నారావు సైతం గుడ్‌బై
కండువాలు వేసి ఆహ్వానించిన కూటమి అభ్యర్థి విజయ్‌కుమార్
ఒంగోలు, ఏప్రిల్ 18 (ఆంరఽధజ్యోతి) : సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాగులుప్పలపాడు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మూడు గ్రామాల్లో గురువారం ఒక్కరోజే పలువురు కీలక నేతలు, వారి అనుచరులతో టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ఆ గ్రామాలకు వెళ్లి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పసుపు కండువాలు వేశారు. నియోజకవర్గంలోనే గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నేత అయిన దివి పున్నారావు తన అనుచరులతో స్వగ్రామమైన పోతవరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సైకిల్ ఎక్కారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న పున్నారావు పోతవరం గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన సతీమణి దివి రంగవల్లి నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా, వైసీపీ ఆవిర్భావం అనంతరం ఆపార్టీ మండల కన్వీనర్‌గా పనిచేసిన పున్నారావు సంతనూతలపాడుతోపాటు ఒంగోలు నియోజక వర్గంలోనూ రాజకీయ వర్గాలకు సుపరిచితులు. ఇక మండలంలోని ఓబన్నపాలెంలో మాజీ సర్పంచ్ వక్కింటి శ్రీనివాసరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు మండవ ప్రసాద్‌తోపాటు పలువురు బీఎన్ సమక్షంలో టీడీపీ చేరారు. అగ్రహారంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు పొద శ్రీధర్‌తోపాటు మరికొంత మంది పసుపు కండువాలు వేసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో వైసీపీ నేతలు పలువురు టీడీపీలో చేరేందుకు మండల నాయకులతోపాటు అభ్యర్థి బీఎన్ విజయకుమార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.