President Draupadi Murmu : వైద్య వృత్తి..మానవ సేవకు గొప్ప మార్గం!
ABN, Publish Date - Dec 18 , 2024 | 05:50 AM
వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ వైద్య విద్యార్థులను ప్రశంసించారు.
మంగళగిరి ఎయిమ్స్‌కు తొలి బ్యాచ్‌తోనే గుర్తింపు: రాష్ట్రపతి
సేవ, అభ్యాసం, పరిశోధనపై విద్యార్థులు దృష్టి పెట్టాలి
మెడికల్ టూరిజం అభివృద్ధిలో డాక్టర్లదే ప్రధాన పాత్ర
వైద్య శాస్త్రాలకు కొత్త సవాళ్లు వాటి పరిష్కారంలో భాగంగానే
ఎయిమ్స్‌లో సైటోజెనిటిక్స్ లేబొరేటరీద్రౌపది ముర్ము వెల్లడి
వైద్య విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం
అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా మానవాళిని సేవించే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ వైద్య విద్యార్థులను ప్రశంసించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవాన్ని బుధవారం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. ఏదైనా ఉన్నత విద్యా సంస్థ ప్రారంభమైన తర్వాత.. అందులోని మొదటి బ్యాచ్ సదరు సంస్థకు గుర్తింపు తీసుకొస్తారని అన్నారు. వైద్య రంగంలో, సమాజంలో, దేశ, విదేశాల్లో మంగళగిరి ఎయిమ్స్ మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులే ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లని ఆమె కొనియాడారు. విజయం, గౌరవం సాధించడానికి.. సేవ, అభ్యాసం, పరిశోధన అనే మూడు విషయాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. కీర్తి, అదృష్టంలో కీర్తికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, దానినే ఎంచుకోవాలని చెప్పారు. భారతీయ వైద్యులు తమ ప్రతిభ, కృషితో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రగామిగా నిలిచారని గుర్తుచేశారు. మన దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇతర దేశాల ప్రజలు భారతదేశాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. ఇండియా ప్రపంచంలో మెడికల్ టూరిజానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, ఇందులో వైద్యులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. మన సంప్రదాయంలో దీర్ఘాయువు, ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రార్థిస్తామని అన్నారు. ‘సకల స్వాస్థ్య సర్వదా’ అనేది మంగళగిరి ఎయిమ్స్ నినాదమని గుర్తుచేశారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిరంతరం ప్రోత్సహించడం, అందరికీ ఆరోగ్యం అందించడాన్ని ఎయిమ్స్‌లో ప్రతి వైద్యుడూ మార్గదర్శక సూత్రంగా తీసుకోవాలని సూచించారు.
వైద్య శాస్ర్తాలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనడానికి కొత్త పరిష్కారాలు అవసరమని.. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎయిమ్స్‌లో సైటోజెనిటిక్స్ లేబొరేటరీ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని ఉపయోగించుకుని ఈ సంస్థ కొత్త పరిశోధనలు, చికిత్సలను అభివృద్ధి చేస్తుందన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్, విద్యామంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్ పాల్గొన్నారు.
రాష్ట్రపతికి ముఖ్యమంత్రి సత్కారం
తొలి స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు సత్కరించారు. శాలువా కప్పి సన్మానించి శ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందించారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ మాధవానంద కర్ ఎయిమ్స్ తరఫున రాష్ట్రపతిని, సీఎంను, కేంద్ర మంత్రి జాదవ్‌ను సత్కరించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో భాగంగా జాదవ్, సత్యకుమార్ 49 మందికి ఎంబీబీఎస్ డిగ్రీలు, నలుగురికి పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు.
రాష్ట్రపతికి చేనేత చీర బహూకరించిన లోకేశ్
మంగళగిరి చేనేత కార్మికులు చేసిన చేనేత చీరెను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి లోకేశ్ బహుకరించారు. అవకాశం వచ్చిన ప్రతిసారి లోకేశ్ మంగళగిరి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తుంటారు. గతంలో ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులకు కూడా ఆయన మంగళగిరి చేనేత వస్త్రాలను అందించి సత్కరించారు. అలాగే ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కూడా తరచూ మంగళగిరి చేనేత వస్త్రాలను ధరిస్తూ అనధికార బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
నలుగురికి బంగారు పతకాలు
ఎయిమ్స్ స్నాతకోత్సవంలో నలుగురు బంగారు పతకాలను అందుకున్నారు. భారత రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పతకాలను స్వీకరించడం పట్ల వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఓవరాల్ అకడమిక్ టాపర్‌గా కేరళకు చెందిన లియా అజీ, బెస్ట్ మేల్ టాపర్‌గా ఏపీకి చెందిన దాసరి దివ్యాంశ్, బెస్ట్ ఫిమేల్ టాపర్‌గా పంజాబ్‌కు చెందిన సుప్రభ సింహా, బెస్ట్ ఇంటర్నషి్‌పగా కేరళకు చెందిన వీకే అథీరా బంగారు పతకాలు అందుకున్నారు.
Updated Date - Dec 18 , 2024 | 05:51 AM