ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Government Policy : అంత లేదు పుష్పా!

ABN, Publish Date - Dec 29 , 2024 | 03:17 AM

ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అటవీ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు! అటవీ శాఖ అధికారులు వేలానికి పెట్టిన సరుకులో...

  • ఎర్ర చందనం వేలానికి స్పందన కరువు

  • టన్నుకు టెండరు రేటు రూ.70 లక్షలు

  • యాభై లక్షలకే బిడ్లు వేసిన వ్యాపారులు

  • తిరుపతి గోడౌన్లలో 5 వేల టన్నుల నిల్వలు

  • అందులో అధిక శాతం మూడో రకమే

  • కరోనా తర్వాత చైనాలో మారిన సీన్‌

  • ఎర్రచందనం ఫర్నిచర్‌ పరిశ్రమలు క్లోజ్‌

  • జపాన్‌, మలేషియా, అరబ్‌ దేశాల్లోనూ తగ్గిన కొనుగోళ్లు

  • చైనాలో ఇప్పుడిప్పుడే తిరిగితెరుచుకుంటున్న ఫ్యాక్టరీలు

‘మంగళం శీనుకు అమ్మితే టన్నుకు యాభై లక్షలు! అదే చెన్నైలో మురుగన్‌కు మనమే నేరుగా అమ్మితే టన్నుకు కోటిన్నర’... ఇది పుష్ప డైలాగ్‌! ఈ ఒక్క మాటతో మొత్తం ఎర్రచందనం సిండికేట్‌ను పడేస్తాడు!

ఇదే డైలాగ్‌ను మన అటవీ శాఖ అధికారులకు వినిపిస్తే... ‘అంత లేదు పుష్పా! టన్నుకు రూ.50 లక్షలకు కూడా కొనే దిక్కులేదు’ అని చెబుతారు. ‘ప్రాణాలకు తెగించి ఎర్రచందనం కొట్టి... అష్టకష్టాలు పడి స్మగ్లింగ్‌ చేయడమెందుకప్పా! టన్నుకు రూ.70 లక్షలు! ఐదువేల టన్నుల స్టాక్‌ రెడీగా ఉంది! డబ్బులు కట్టి తీసుకుపో పుష్పా! ఏ షెకావత్తూ నిన్ను అడ్డుకోడు’ అని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేస్తారు!

ఇదీ... రీల్‌కు, రియల్‌కూ మధ్య తేడా!

(అమరావతి, మంగళం - ఆంధ్రజ్యోతి)

ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అటవీ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు! అటవీ శాఖ అధికారులు వేలానికి పెట్టిన సరుకులో... చాలా వరకు మూడో రకానిది కావడమే ముఖ్య కారణం! యాంటీ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలను తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడిపాలెం గోడౌన్లలో నిల్వ ఉంచారు. సుమారు 40 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి ఒకటో రకం ఎర్రచందనం వస్తుంది. అంతకు తగ్గితే రెండో రకం! ఇక... దుంగల సైజును బట్టి మూడో రకంగా వర్గీకరిస్తారు. పట్టుబడిన సరుకులో చాలావరకు మూడో రకమే!


అంతోఇంతో దొరికిన మొదటిరకం సరుకు వేలంలో అమ్ముడవుతుంది. రెండో రకంలో సగం, మూడో రకంలో దాదాపు 80 శాతం వరకూ అమ్ముడుపోదు. పదేళ్లుగా నిల్వ ఉన్న ఎర్రచందనంలో మూడో రకమే ఎక్కువగా ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. తిమ్మినాయుడిపాలెం గోడౌన్‌లో ప్రస్తుతం 5,376 టన్నుల ఎర్రచందనం ఉంది. గ్లోబల్‌ టెండర్ల ద్వారా నిరుడు కొంత ఎర్రచందనం వేలానికి ప్రయత్నించినా.. టెండర్‌దారులు ముందుకు రాలేదు. తాజాగా 905 టన్నులు విక్రయించేందుకు రాష్ట్ర అటవీశాఖ టెండర్లు ఆహ్వానించినా కొనుగోలుదారుల నుంచి స్పందన కనిపించలేదు. గత ఏడాది కాలంలో మూడుసార్లు టెండర్లు పిలిచినా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపలేదు. అటవీశాఖ టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించింది. కానీ, ఎక్కువ మంది టెండరుదారులు రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. టెండర్‌ రేటుకు బిడ్లు వేసిన ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కూడా 30%మించలేదు. 2022లో 500 టన్నులు వేలం వేయగా.. ఇంకా 4,900 టన్నులు మిగిలి ఉంది. అందులో 2023లో లాట్‌ల వారీగా 400-500 టన్నుల చొప్పున రెండు సార్లు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. కానీ టెండర్‌ రేటు కన్నా తక్కువ కోట్‌ చేస్తూ బిడ్లు వచ్చాయి. అనుకున్న ధరకు కాస్త అటూఇటుగా ఉన్న బిడ్లను మాత్రమే ఖరారు చేసి, మిగతా లాట్‌ల వేలాన్ని అధికారులు ఆపేశారు.


కరోనా దెబ్బ...

2016-19 మధ్య నిర్వహించిన వేలంలో టన్ను ఎర్ర చందనం రూ.70-75 లక్షలు పలికింది. నాటి గరిష్ఠ ధరనే ఇప్పుడు కనీస ధరగా నిర్ణయించారు. ఎర్రచందనాన్ని అధికారికంగా కొనే కంపెనీలు చైనాలో పది దాకా ఉన్నాయి. మన దేశానికి చెందిన వారెవరు వేలంలో కొన్నా... చైనా కంపెనీలకు అమ్మాల్సిందే. అయితే... కరోనా సమయంలో చైనా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో... రాష్ట్రంలో నిర్వహించే ఎర్రచందనం వేలానికి స్పందన కనిపించడంలేదు. మరోవైపు... జపాన్‌, మలేషియా, సింగపూర్‌, అరబ్‌ దేశాల్లో విలాసవంతమైన భవన నిర్మాణం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనంతో తయారయ్యే ఫర్నిచర్‌, ఉపకరణాలకు డిమాండ్‌ పడిపోయిందని పేర్కొంటున్నారు. చైనాకు సంబంధించిన రెండు కంపెనీలు ఇప్పుడే తమ కార్యకలాపాలు ప్రారంభించాయని... మరికొన్నీ అదే బాటలు ఉన్నాయని తెలిసింది. దీంతో... ఎర్ర చందనానికి మునుపటి డిమాండ్‌ వస్తుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.

శేషాచలమే కేంద్రం

‘ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు... మన శేషాచలం అడవుల్లోనే ఉండాది’... ఈ మాట నిజం. చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌, అరబ్‌ దేశాల్లో సంపన్నులు ఎర్రచందనం కర్రతో ఫర్నిచర్‌ చేయించుకుని హోదా ప్రదర్శిస్తారు. ఈ కర్రతో చేసే ఫర్నిచర్‌ 50 ఏళ్లయినా చెక్కు చెదరదు. ఈ డిమాండ్‌ను గమనించిన స్మగ్లర్లు శేషాచలం కొండల నుంచి ఎర్రచందనాన్ని నరికి అక్రమంగా దేశ విదేశాలకు సరఫరా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అటవీ సిబ్బందిని సైతం హత్య చేసి ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయి. ఈ అరుదైన సంపదను ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో స్మగ్లింగ్‌ను కట్టడి చేశారు. 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను దాదాపు నిర్వీర్యం చేసింది. కనీస పర్యవేక్షణ లేకుండా ఐజీ పోస్టు తీసేసి పనిష్మెంట్‌ కింద ఒక ఎస్పీ స్థాయి అధికారిని బలవంతంగా నియమించడంతో శేషాచలంలో అరుదైన వృక్షజాతితో పచ్చగా ఉన్న అటవీ ప్రాంతం మోడు బారింది.


ఇదీ కారణం...

ఎర్రచందనాన్ని ఆన్‌లైన్‌లో వేలం ద్వారా విక్రయించడానికి చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వకపోవడం నిజమే! కరోనా కారణంగా చైనా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో అక్కడి పరిశ్రమలు భారీగా మూతపడ్డాయి. అందులో ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఎర్రచందనంతో తయారయ్యే ఫర్నిచర్‌, ఇతర పరికరాలు జపాన్‌, థాయ్‌లాండ్‌ దేశాలకు చైనా నుంచే ఎగుమతి అవుతాయి. చైనాలోనే పరిశ్రమలు మూతపడడంతో ఇతర దేశాల్లో కూడా కొనుగోలుదారులు తగ్గుముఖం పట్టారు. దీంతో గ్లోబల్‌ టెండర్లకు పెద్దగా స్పందన రాలేదు. అయినప్పటికీ... తక్కువ ధరకు అమ్మడానికి సిద్ధంగాలేం. చైనాలో మూతపడ్డ ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.’’

- సెల్వం, సీసీఎఫ్‌, తిరుపతి

Updated Date - Dec 29 , 2024 | 03:17 AM