Andhra Pradesh : ఏబీవీ వ్యవహారంలో తీర్పు రిజర్వ్
ABN , Publish Date - May 24 , 2024 | 06:40 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుబడుతూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఏబీవీపై క్యాట్ ఉత్తర్వుల రద్దుకు అప్పీల్
హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుబడుతూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టిందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయనను సర్వీసులోకి తీసుకోకముందే రెండోసారి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందన్నారు.
ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు న్యాయసలహా సైతం తీసుకుందన్నారు. అందుకు సంబంధించిన నోట్ ఫైల్, ఇతర వివరాలను కోర్టు ముందు ఉంచారు. రెండోసారి సస్పెండ్ చేయాలని ఎందుకు నిర్ణయానికి వచ్చారో కారణాలు పేర్కొనలేదన్నారు. సాక్షులను బెదిరిస్తున్నందునే సస్పెండ్ చేశామని చెబుతున్నారన్నారు. ఎవరిని బెదిరించారో, ఆ వివరాలను ట్రైబ్యునల్ ముందు ఉంచలేదన్నారు.
ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకముందే శాఖాపరమైన విచారణ పేరుతో 15నెలల పాటు పిటిషనర్‌ను సస్పెన్షన్‌లో ఉంచారన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తక్షణం ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించిందని, ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం అవసరం లేదన్నారు. మరోవైపు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ...కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయన్నారు. సస్పెన్షన్‌కు తగిన కారణాలు ఉన్నాయని గుర్తించడంలో ట్రైబ్యునల్ విఫలమైందన్నారు.
పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ అభియోగాలపై విచారణ ముగిసేవరకు ఒక అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ట్రైబ్యునల్ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.