ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Godavari : పార్శిల్‌లో మృతదేహం డెలివరీ

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:53 AM

‘మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్స్‌, పెయింటింగ్‌ డబ్బాలు పంపించాం. మరి కొంత ఇంటి సామగ్రిని పంపిస్తున్నాం’ అంటూ ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.

  • పశ్చిమ గోదావరి జిల్లా యండగండిలో కలకలం

  • ఇంటి నిర్మాణ సామగ్రి పంపిస్తున్నామంటూ ఫోన్‌

  • ఆటోలో వచ్చిన చెక్క పెట్టె... అందులో మృతదేహం

ఉండి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్స్‌, పెయింటింగ్‌ డబ్బాలు పంపించాం. మరి కొంత ఇంటి సామగ్రిని పంపిస్తున్నాం’ అంటూ ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. చెప్పిన విధంగానే ఆటోలో ఓ చెక్క పెట్టె వచ్చింది. ఆ పెట్టెను ఆమె తెరవగా తీవ్రమైన దుర్వాసనతో కుళ్లిపోయిన ఓ మృతదేహం కనిపించింది. దానిని చూడగానే ఆమె కేకలు వేస్తూ పరుగులు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో జరిగిందీ ఘటన. ఆ మృతదేహం ఎవరిది? దానిని ఎవరు పంపించారు? ఇక్కడికే ఎందుకు పంపించారు? తదితర విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు యండగండికి చెందిన ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. పెద్ద కుమార్తె తులసిని నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె కుమార్తెను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేశారు. భీమవరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆమె ఉద్యోగం సంపాదించి పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. యండగండిలో తులసికి జగనన్న కాలనీలో స్థలం వచ్చింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలని రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకున్నట్టు చెబుతున్నారు. దీంతో ఇంటికి అవసరమైన టైల్స్‌, పెయింటింగ్‌ డబ్బాలు రెండు విడతలుగా వచ్చాయి.


ఇదే విషయాన్ని ఆమె వాట్స్‌పకు సమాచారం ఇచ్చారు. గురువారం తులసికి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. మరింత సామగ్రిని పంపిస్తున్నట్టు అవతలి వ్యక్తులు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు ఒక చెక్క పెట్టెను ఆటోలో తీసుకువచ్చి ఇంటి వద్ద దించారు. చెక్క పెట్టెను తెరిచే ప్రయత్నం చేయగా, దానికి తాళం వేసి ఉంది. తాళం చెవితోపాటు ఒక లేఖను పెట్టెకు ఉన్న కవర్‌లో పెట్టారు. ‘మీరు కోటీ 30 లక్షలు చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు’ అని ఆ లేఖలో రాసి ఉంది. పెట్టి తెరవగానే దుర్వాసన గుప్పుమంది. లోపల పేపర్లు కప్పి ఉన్నాయి. వాటిని తొలగించి చూడగా, కుళ్లిపోయిన మృతదేహం కనిపించింది. తండ్రీకూతురు కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీశారు. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. పోలీసులు భారీ సంఖ్యలో గ్రామంలో మోహరించారు. 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తి మృతదేహంగా తేల్చారు. శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ నయీం అద్నాన్‌ అస్మి, ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐలు నజీరుల్లా, మంతెన రవివర్మ, నాగరాజులతోపాటు పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. రంగరాజు, తులసిని పోలీసు స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. వారితో ఎవరినీ కలవనీయడం లేదు. ఫోన్‌లోనూ మాట్లాడనీయడం లేదు. మరోవైపు పార్సిల్‌ తెచ్చిన ఆటోవాలాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెట్టె ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎవరు ఇచ్చారు? ఇక్కడికి తీసుకెళ్లమని ఎవరు చెప్పారు? తదితర వివరాలు రాబడుతున్నారు. అలాగే, రంగరాజు చిన్న కుమార్తె భర్త.. మొగల్తూరుకు చెందిన సిద్దార్దవర్మను పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు తెలిసింది. అక్కడ నుంచి జిల్లాకు తీసుకొస్తున్నట్లు సమాచారం. పోలీసు బృందాలు భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. వరసపెట్టి అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటుండడంతో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పోలీసులు వివరాలు చెప్పడం లేదు.


  • క్షత్రియ సేవా సమితి ఖండన..

క్షత్రియ సేవా సమితి నుంచి మృతదేహం పార్శిల్‌ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ రాజమండ్రికి చెందిన క్షత్రియ సేవా సమితి ఖండించింది. రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప క్షత్రియ పరిషత్‌ అనేది లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ సమితిలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఆర్థికంగా సహాయం చేస్తామని, ఇతర ప్రాంతాల వారికి చేయబోమని వివరించింది. యండగండి ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది.

Updated Date - Dec 21 , 2024 | 04:54 AM