Spam Calls and SMS Affecting : ‘స్పామ్’.. ఏపీ!
ABN, Publish Date - Dec 11 , 2024 | 03:15 AM
‘‘మీరు స్థలం కొనాలనుకుంటున్నారా? బెంగళూరు శివారులో మా సంస్థ కొత్తగా వెంచర్ వేసింది. ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి త్వరపడండి. మీ పేరును రిజిస్టర్ చేసుకోండి’’- ‘‘మా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ ఇస్తున్నాం.
స్పామ్ కాల్స్ రిసీవర్స్‌లో రెండో స్థానంలో రాష్ట్రం
మొదటి స్థానంలో ఢిల్లీ
ల్యాండ్ ఫోన్లకు కూడా
ఢిల్లీ, ముంబై సహా కర్ణాటకల నుంచి కాల్స్
గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతాల నుంచి మెసేజ్‌లు
విజయవాడ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు స్థలం కొనాలనుకుంటున్నారా? బెంగళూరు శివారులో మా సంస్థ కొత్తగా వెంచర్ వేసింది. ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి త్వరపడండి. మీ పేరును రిజిస్టర్ చేసుకోండి’’- ‘‘మా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ ఇస్తున్నాం. మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి రూ.35 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తాం’’ - బాగా బిజీలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ వినియోగదారులను ఇబ్బంది పెట్టడమే కాకుండా వారికి చిరాకు తెప్పిస్తున్న ఫోన్‌కాల్స్ ఇవి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ముఖ్యమైన ఫోన్‌కాల్ అని భావించి ఆన్సర్ చేస్తేఅర్థం కాని భాషలో ఎవరెవరో మాట్లాడతారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను స్పామ్‌కాల్స్‌గా టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) గుర్తించింది. ఈ తరహా స్పామ్ కాల్స్ బాధితులు ఏపీలో ఎక్కువ మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే స్పామ్ కాల్స్‌ను ఆనర్స్ చేస్తున్న వారిలో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఏపీ 2వ స్థానంలో ఉంది. స్పామ్‌కాల్స్, ఎస్‌ఎంఎ్‌సలపై ఎయిర్‌టెల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ నివేదికను విజయవాడలో మంగళవారం విడుదల చేసింది. వివిధ కేటగిరిల్లో ఈ సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ తర్వాత స్పామ్‌కాల్స్, ఎస్‌ఎంఎ్‌సలతో బాధపడే సెల్‌ఫోన్ యూజర్లు ఏపీలో అత్యధికంగా ఉన్నారు.
స్పామ్ కాల్స్‌ను స్వీకరిస్తున్న వారిలో 79 శాతం మంది పురుషులు, 21 శాతం మంది మహిళలు ఉన్నారు. ఢిల్లీ, ముంబై, కర్ణాటక నుంచి ఎక్కువగా ల్యాండ్‌లైన్ల నుంచి ఈ కాల్స్ వస్తున్నాయి. 35 శాతం మంది స్పామర్లు ల్యాండ్‌లైన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ కాల్స్ పని దినాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఫోన్లు చేసే స్పామర్లు ఆదివారం మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆదివారం 40 శాతం వరకు స్పామ్‌కాల్స్ తగ్గుతున్నాయి. ఈ కాల్స్ ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు మాత్రం గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా నుంచి అధికంగా వస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. స్పామ్ ఎస్‌ఎంఎ్‌సలు రిసీవ్ చేసుకుంటున్న బాధితులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నారు.
‘సమయం’ చూసుకుని!
ఈఎంఐ విధానంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది రూ.30 వేలు ఆపైన ధర పలికే ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి ఫోన్లకు స్పామ్ కాల్స్ తక్కువగా వస్తున్నాయని ఎయిర్‌టెల్ సర్వే పేర్కొంది. రూ.15 వేల నుంచి రూ.20 వేల ఖరీదు చేసే ఫోన్లకు మాత్రం స్పామ్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. సెల్‌ఫోన్ యూజర్లు రోజుకు 13 గంటలపాటు స్పామ్‌కాల్స్‌తో ఇబ్బందులు పడుతున్నారని సర్వేలో తేలింది. పగటి పూట 7 గంటలు, రాత్రి సమయంలో 6 గంటల పాటు స్పామ్‌కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో సెల్‌ఫోన్ యూజర్లకు అత్యధిక సంఖ్యలో స్పామ్ కాల్స్ వస్తున్నాయి. తర్వాత రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్య కూడా స్పామ్‌కాల్స్ మోగుతూనే ఉంటున్నాయని వినియోగదారులు తెలిపారు.
Updated Date - Dec 11 , 2024 | 03:15 AM