TDP Govt : పోలవరానికి మళ్లీ కళ
ABN, Publish Date - Dec 16 , 2024 | 04:52 AM
జగన్ హయాంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. ధ్వంసమైన కట్టడాల పునర్నిర్మాణానికి ఆయన నడుం బిగించారు.
కార్మికులు, వాహనాల సందోహం
పనుల పూర్తి దిశగా బాబు అడుగులు
నేడు ప్రాజెక్టు ప్రాంతానికి సీఎం
పనుల కార్యాచరణ ప్రకటించే చాన్సు
ఏలూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. ధ్వంసమైన కట్టడాల పునర్నిర్మాణానికి ఆయన నడుం బిగించారు. కేంద్రంలోని మోదీ ప్ర భుత్వంలో భాగం కావడంతో పాటు పోలవరం పనుల కోసం ముందస్తు నిధులు సాధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లు ఖర్చుచేయాల్సి ఉ ందని.. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోనందున అడ్వాన్సుగా ఈ మొత్తం ఇవ్వాలని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ముందస్తుగా 2,300 కోట్లను కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలు విడుదల చేశాయి. వీటిలో 75 శాతం నిధులు ఖర్చుపెడితే మిగతా రూ.2,700 కోట్లు ఇస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్ జైన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 2న కొత్త డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాలని సీఎం ఈ నెల 11న జరిగిన సమీక్షలో కాంట్రాక్టు సంస్థలు, రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇంకోవైపు.. వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా గైడ్‌వాల్స్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళ వచ్చింది. నిర్మాణ ప్రాంతంలో కార్మికులు, వాహనాల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబరు నాటికి వాల్ పనులు పూర్తి చేసేందుకు అనువైన పరిస్థితులు సృష్టించారు.
మట్టి, రాతి నాణ్యత పరిశీలన, ప్లాట్‌ఫాం పనులు, మట్టి తరలింపు పనులు వేగం పుంజుకున్నాయి. గతంలో వాల్ నిర్మించినప్పుడు నది అంతర్భాగంలో 136 అడుగుల వరకు తవ్వారు. ఇప్పుడు 150 అడుగులు మేర తవ్వుతున్నట్లు సమాచారం. పాత వాల్ నిర్మించిన జర్మన్ బావర్ సంస్థే కొత్త వాల్ పనులు చేపడుతోంది. ప్రధాన డ్యాం నిర్మాణంలో డయాఫ్రం వాల్ అత్యవసరం.
నీటి ఊట ప్రాజెక్టులో చేరకుండా ఇది అడ్డుకుంటుంది. ఈ కారణంగానే వరదలతో దెబ్బతిన్న పాత వాల్‌కు ప్రత్యామ్నాయంగా ఎలాంటి రాజీ లేకుండా కొత్త వాల్ నిర్మాణం చేపడుతున్నారు. 2027 జూలైకల్లా దీని పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత వరకు గడువులోపే పూర్తి చేయాలని సీఎం సూచించారు. జల విద్యుత్ కేంద్రం పురోగతిపైనా దృష్టి పెట్టారు. ఇప్పటికే పవర్ హౌస్ నిర్మాణంలో టర్బన్ స్టేరింగ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు క్షేత్రంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన సోమవారం ఇక్కడకు రానున్నారు. పనుల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్-1, గ్యాప్-2 వైబ్రో కంపాక్షన్ పనులను, డీవాల్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తారు. మధ్యాహ్నం అతిథిగృహంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణదారులతో సమావేశమవుతారు. గడువులోపు ప్రాజెక్టు పూర్తి కావడానికి పనుల కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
Updated Date - Dec 16 , 2024 | 05:02 AM