AP Assembly: అదే సీన్ రిపీట్... శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్
ABN, First Publish Date - 2024-02-07T10:09:03+05:30
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు మొదలయ్యాయి. సభ మొదలవగా రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
అమరావతి, ఫిబ్రవరి 7: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) మూడవ రోజు మొదలయ్యాయి. సభ మొదలవగా రైతాంగ సమస్యలపై టీడీపీ(TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఈరోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరాకరించారు.
సభలో నిరసనల హోరు...
సభ మొదలవగానే వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఐఐఐటీలకు సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం (Jagan Government) నశించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి సభలో ఏర్పడింది.
జగన్ సార్... పట్టించుకోండి సర్...
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కౌలు రైతులను, రైతులను, పోలవరం పట్టించుకోని ప్రభుత్వం నశించాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జగన్ సార్... రైతులను పట్టించుకోండి అంటూ ఆందోళన చేశారు. పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కేకలు వేశారు. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం నశించాలన్నారు. రైతు దగా ప్రభుత్వం అని.. ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. వారిని తీసుకెళ్లేందుకు సభలోకి వచ్చిన మార్షల్స్‌కు ఎదురుతిరిగారు. టీడీపీ సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. గందరగోళ పరిస్థితిలోనే స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించారు.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు వీరే..
బెందళం అశోక్
అచ్చెన్నాయుడు
నందమూరి బాలకృష్ణ
బుచ్చయ్య చౌదరి
నిమ్మకాయల చినరాజప్ప
ఘన వెంకట రెడ్డి నాయుడు
వెలగపూడి రామకృష్ణబాబు
నిమ్మల రామానాయుడు
రామరాజు
డోలా బాలవీరాంజనేయస్వామి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - 2024-02-07T10:57:46+05:30 IST