Telugu Desam: పని చేసినోళ్లకు ప్రాధాన్యమెలా..?
ABN, Publish Date - Jul 05 , 2024 | 08:00 AM
ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు, శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత ఐదేళ్లలో..
నామినేటెడ్ పదవులపై టీడీపీ నాయకత్వం కసరత్తు
ఒత్తిళ్లను తట్టుకున్నవారికి అవకాశం
దాడుల బాధితులకు కూడా..
నియోజకవర్గాలవారీగా వివరాల సేకరణ
8లోగా నామినేటెడ్ పోస్టుల వివరాలివ్వండి
ఉన్నతాధికారులకు జీఏడీ ఆదేశాలు
అమరావతి, ఆంధ్రజ్యోతి: ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు, శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత ఐదేళ్లలో ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా వారందరికీ అంతర్గతంగా ర్యాంకులు ఇచ్చి తదనుగుణంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లల్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను సోమవారం లోపు పంపించాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సర్య్కులర్ కూడా జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వివిధ పార్టీ విభాగాల నేతలతో నాయకత్వం సమావేశం నిర్వహించింది.
నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీకి– ప్రభుత్వానికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక అంశాలపై చర్చించారు. అధికారంలోకి వచ్చాక నాయకుల సిఫారసులతో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తుంటారని, అయితే వీరిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికి ఎలా ప్రాధాన్యమివ్వాలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. గత ఐదేళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు.. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేసిన వారెవరు.. దాడులకు గురైన వారెవరు అనేవి పరిగణనలోకి తీసుకుంటూ సమాచారం సేకరించాలని.. దాని ప్రాతిపదికగా వారికి ర్యాంకులు ఇవ్వాలని ప్రాథమికంగా నిశ్చయించారు. నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇచ్చే సమయంలో ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ దిశగా కసరత్తు చేయాలని సమావేశం నిర్ణయించింది.
పార్టీ నేతల వినతులకు పెద్దపీట
ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నేతల నుంచి వచ్చే వినతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించేలా చూడాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఈ వినతులను మంత్రులు, అధికారులు, సంబంధిత శాఖలకు పంపే సమయంలో వాటిని రికార్డు చేసి.. అవి త్వరగా పరిష్కారమయ్యేవరకు వెంటపడుతూ ఉండాలని, వాటిపై నిరంతర సమీక్ష ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర కార్యాలయానికి పార్టీ సభ్యులు ఎవరు వచ్చి వినతులు ఇచ్చినా.. వాటికొక నంబరు ఇచ్చి ప్రభుత్వ శాఖలకు పంపాలని.. అవి కూడా త్వరగా పరిష్కారం కావడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. వినతుల పరిశీలన, పరిష్కారంపై దృష్టి పెట్టడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా చర్చించారు.
మండలాల నుంచీ అక్రమ కేసుల సమాచారం
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులపై మోపిన అక్రమ కేసులపైనా సమావేశంలో చర్చించారు. అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల నుంచి ఈ కేసుల సమాచారం తెప్పించి వాటిని విశ్లేషించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని, రాజకీయ వేధింపులకు గురైన కేడర్‌కు కేసుల నుంచి ఉపశమనం కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
వైసీపీ అక్రమాలపై చర్యలు..
వైసీపీ నేతల అక్రమాలపై ప్రతిపక్షంలో చేసిన పలు ఆరోపణల విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక అంశాలపై పార్టీ నేతలు ఆరోపణలు చేశారని, వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు సూచించారు. దీనికి నాయకత్వం అంగీకరించింది.
ఏ శాఖలో ఎన్ని నామినేటెడ్ పోస్టులు?
రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లల్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను వెంటనే పంపించాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లోని సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పోస్టులతో పాటు సొసైటీలు, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా సత్వరమే పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. వచ్చే సోమవారం (8వ తేదీ) ఉదయం 11.30లోపు ఆ వివరాలు పంపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వంలో నియమించే అన్ని పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించారు.
Updated Date - Jul 05 , 2024 | 11:55 AM