Share News

పెన్నాకు గోదారి!

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:58 AM

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పెన్నాకు గోదారి!

నదుల అనుసంధానంపై మళ్లీ కదలిక

గోదావరి-కృష్ణా-పెన్నా ప్రాజెక్టుపై కూటమి సర్కారు కసరత్తు

సీమ, దక్షిణ కోస్తాకు రోజుకు 2 టీఎంసీల మిగులు జలాలు

పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు

వైకుంఠపురం నుంచి బొల్లాపల్లికి.. అక్కడ కొత్త రిజర్వాయర్‌

బొల్లాపల్లి నుంచి బనకచర్లకు జలాలు.. అట్నుంచి సోమశిల,

తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా కాలువలకు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ

కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక సమస్యలున్నా ఈ ప్రాజెక్టును పట్టా లెక్కించడంపై దృష్టిసారిస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చిస్తోంది. వీటి ప్రకారం పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను రోజు (సీజన్‌లో)కు రెండు టీఎంసీల చొప్పున కృష్ణా నదికి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి తరలిస్తారు. అక్కడ రిజర్వాయర్‌ను నిర్మించి, అక్కడి నుంచి నల్లమల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బనకచర్లకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సోమశిల, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవాకు పంపి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేస్తారు.


పోలవరం నుంచి 2 ప్రతిపాదనలు

గోదావరి జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలోనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలువ సామర్థ్యాన్ని బట్టి కృష్ణా డెల్టాకు 17,561 క్యూసెక్కుల జలాలను తరలింవచ్చు. ప్రస్తుత కాలువ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 23,113 క్యూసెక్కులను తరలించే వీలుందని జల వనరుల శాఖ పేర్కొంది. అలాగే కాలువ లోతును ఐదు నుంచి ఆరు మీటర్లకు తవ్వితే రోజూ 40,674 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా పోలవరం కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా కొత్తగా కాలువను తవ్వి గోదావరి జలాలను తరలించే మరో ప్రతిపాదననూ జల వనరుల శాఖ పరిశీలించింది. ఈ కాలువను కొత్తగా తవ్వుతున్నందున అవసరమైన మేర లోతులోనూ, లైనింగ్‌లోనూ నిర్మించే వీలుందని చెబుతోంది. గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తులో ఉన్న కృష్ణాకు ఎత్తిపోయడం వల్ల చివరి ప్రాంతానికి జలాలు వేగంగా ప్రవహించే వీలుందని జల వనరుల శాఖ పేర్కొంది. అయితే.. ఈ కాలువ తవ్వకానికి 10,000 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఇది చాలా కష్టసాధ్యమైనదని అభిప్రాయపడింది. ముందుగా ప్రతిపాదించినట్లుగా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి, సమీపాన వైౖకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరు-బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించే ప్రతిపాదన వైపే జల వనరుల శాఖ మొగ్గు చూపింది.

కృష్ణా నుంచి ఇలా...

కృష్ణా నదికి తరలించిన గోదావరి మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. కాలువల తవ్వకానికి, బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించాలి. బొల్లాపల్లి రిజర్వాయరు నుంచి నల్లమల మీదుగా బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా జల వనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల 22 టీఎంసీలను వెలిగొండ ప్రాజెక్టుకు సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. ఇక బనకచర్ల కాంప్లెక్స్‌ నుంచి తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు 140 టీఎంసీలను తరలించవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు 180 టీఎంసీల గోదావరి జలాలను తరలించే వీలుందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

గరిష్ఠంగా నీటి తరలింపు!

కాలువల తవ్వకం, విస్తరణ ద్వారా గోదావరి మిగులు జలాలను వీలైనంత వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు తరలించవచ్చని జల వనరుల శాఖ అంచనా వేసింది. గోదావరి జలాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణం జరుగుతున్న జలాశయాలు, కాలువల ద్వారా 121 రోజుల్లో 75.1 టీఎంసీలను ఎత్తిపోయవచ్చని పేర్కొంది. 117 రోజుల పాటు 11,583 క్యూసెక్కుల ప్రవాహంతో 122.7 టీఎంసీలను తరలించేందుకు కూడా వీలుందని పేర్కొంది. ఇక 116 రోజుల్లో 14,126 క్యూసెక్కుల ప్రవాహంతో 148.8 టీఎంసీలను, అదేవిధంగా 111 రోజుల్లో 17,657 క్యూసెక్కులతో 184.5 టీఎంసీలను, 107 రోజుల పాటు 21,188 క్యూసెక్కులతో 215 టీఎంసీలను, 105 రోజుల పాటు 23,166 క్యూసెక్కులతో 231.4 టీఎంసీలను, 104 రోజుల్లో 24,720 క్యూసెక్కులతో 244 టీఎంసీలను ఎత్తిపోసే వీలుందని జల వనరుల శాఖ పేర్కొంది. కాలువల ద్వారా 34,749 క్యూసెక్కుల ప్రవాహంతో 96 రోజుల పాటు 320.5 టీఎంసీలను తరలించే వీలుందని జల వనరుల శాఖ లెక్కింది. అలాగా 92 రోజుల పాటు 38,845 క్యూసెక్కులతో 345.9 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా, పెన్నాకు ఎత్తిపోయవచ్చని గణాంకాలు వేసింది.

Updated Date - Nov 14 , 2024 | 04:59 AM