Road mishap : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
ABN, Publish Date - Dec 22 , 2024 | 05:05 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా నలుగురి మృతి
11మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం
శ్రీసత్యసాయి జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో
మడకశిర, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఓ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంటు లారీని టెంపో ట్రావెలర్ ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండ లం కుంబర నాగేపల్లి గ్రామానికి చెందిన ప్రేమకుమారి(30), ఆమె కుమారుడు ఆధ్వర్య(2), కుటుంబ సభ్యురాలు రత్నమ్మ(65), డ్రైవర్ మనోజ్(32)గా గుర్తించారు. మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో శనివారం తెల్లవారుజామున 4.45 గంట ల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తిరుగుప్రయాణంలో విషాదం
కుంబర నాగేపల్లి గ్రామానికి చెందిన శివరాజ్, ప్రేమకుమారి దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. కొడుకు అథర్వ పుట్టు వెంట్రుకలను తీయించేందుకు తిరుమల శ్రీవారి సన్నిధికి రెండు వాహనాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గురువారం వెళ్లారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తిరుగుప్రయాణమయ్యారు. మరో అరగంటలో గమ్యానికి చేరుకునేవారు. డ్రైవర్ మనోజ్ నిద్రమత్తు కారణంగా బుళ్లసముద్రం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంటు లారీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో అఽథర్వ, ప్రేమకుమారి అక్కడికక్కడే మృతి చెందారు. శివరాజ్ పెద్దమ్మ రత్నమ్మ, డ్రైవర్ మనోజ్ మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేలోగా మృతిచెందారు. వాహనంలో ఉన్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మడకశిర ఆస్పత్రి నుంచి తుమకూరులోని (కర్ణాటక) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Updated Date - Dec 22 , 2024 | 05:05 AM