ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyclonic Activity : స్థిరంగా అల్పపీడనం

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:00 AM

బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలు/తుఫాన్లకు అనుకూలంగా మారింది. గత నెలలో ఒక తుఫాన్‌ రాగా, ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది.

  • నేటికి తీవ్ర అల్పపీడనంగా బలోపేతం

  • రేపు వాయుగుండంగా మార్పు

  • 14, 15 తేదీల్లో మరో అల్పపీడనం

  • దక్షిణ కోస్తా, సీమకు భారీ వర్షసూచన

  • చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు

  • తూర్పుగాలుల ప్రభావమే కారణం

విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాతావరణం అల్పపీడనాలు/తుఫాన్లకు అనుకూలంగా మారింది. గత నెలలో ఒక తుఫాన్‌ రాగా, ప్రస్తుతం ఒక అల్పపీడనం కొనసాగుతుంది. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ‘ఫెంగల్‌’ తుఫాన్‌తో తమిళనాడు, పుదుచ్చేరి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీలోని కోస్తా, రాయలసీమల్లోనూ వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. బుధవారం కల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా రానుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రికి వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయన్నారు.


వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో దక్షిణ కోస్తా తీరంలో గంటకు 30 నుంచి 35 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈనెల 14న లేదా 15న దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో తూర్పుగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, అందువల్ల కొద్దిరోజులుగా తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని తెలిపారు. మరికొద్ది రోజులు తూర్పుగాలుల ప్రభావం కొనసాగుతుందని, ఒక్కొక్కసారి సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయని చెప్పారు. తూర్పుగాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ప్రభావం స్వల్పంగా ఉందన్నారు.

  • నాలుగు రోజులు వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. వరి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.

Updated Date - Dec 10 , 2024 | 07:25 AM