Share News

సజ్జల ఎక్కడ?

ABN , Publish Date - Sep 11 , 2024 | 03:37 AM

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఐదేళ్లు సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు

సజ్జల ఎక్కడ?

ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గిన సలహాదారు హడావుడి

జగన్‌ ఉన్నప్పుడూ తాడేపల్లిలో కనిపించని వైనం

హైదరాబాద్‌లో ఉన్నారంటున్న వైసీపీ వర్గాలు

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఐదేళ్లు సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్నీ తానై నడిపించిన ఆయన.. జూన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అంత క్రియాశీలంగా లేరు. దీనికి తోడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇటీవల బీజేపీ అనుబంధ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల మోహన్‌ దత్‌కు పార్టీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు సజ్జల కూడా నిర్వహించేవారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వీరిద్దరూ తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్దగా రావడం లేదు.


ముఖ్యంగా సజ్జల ఎన్ని సార్లు వచ్చారో వేళ్లతో లెక్కబెట్టవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉండగా ప్రభుత్వంపై విమర్శలు వస్తే.. పార్టీ తరఫున గానీ, ప్రభుత్వం తరఫున గానీ.. శాఖలతో సంబంఽధం లేకుండా అనుకూల మీడియా ముందు మాట్లాడేవారు. మంత్రులు మాట్లాడాల్సిన అంశాలనూ ఆయనే మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన జాడ తెలియడం లేదు. జగన్‌ తరచూ బెంగళూరు యలహంక ప్యాలె్‌సకు వెళ్తూ ఎక్కువ రోజులు అక్కడే గడుపుతున్నారు. తన సన్నిహితులెవరైనా కేసుల్లో జైలుకు వెళ్తే పరామర్శించడానికి వస్తున్నారు.


ఆ సమయాల్లో కూడా సజ్జల రాకపోవడం గమనార్హం. బెజవాడ వరద ప్రాంతాల్లో జగన్‌ పర్యటించినప్పుడు కూడా వెంట లేరు. దీంతో సజ్జల ఎందుకు దూ రంగా ఉంటున్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే సజ్జల కుమారుడు భార్గవరెడ్డిని వైసీసీ సోషల్‌ మీడియా విభాగం నుంచి తప్పించారు. ఇప్పుడు సజ్జలను కూడా జగన్‌ దూరం పెట్టారా అని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డిని కూడా జగన్‌ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారని తెలుస్తోంది. ఢిల్లీలో కొన్నాళ్ల కిందట జరిగిన ధర్నా ఏర్పాట్ల బాధ్యతను ఆయనకు అప్పగించినా.. ఆ తర్వాత ఏ పనీ అప్పగించలేదు.

Updated Date - Sep 11 , 2024 | 07:10 AM