Guntur : ‘చావు’ రాజకీయం!
ABN, Publish Date - Jul 19 , 2024 | 04:52 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా!? వైసీపీలో గ్యాంగ్ వార్ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు!
హతుడు రషీద్, హంతకుడు జిలానీలు గతంలో ఖాన్ ముఠాలో సభ్యులే
ఖాన్ వినుకొండ వైసీపీ అధ్యక్షుడు.. ఐదేళ్లుగా ‘గ్యాంగ్’తో దందాలు
గత తొలి ఏకాదశి రోజున గ్యాంగ్‌లో వార్.. రషీద్, జిలానీ మధ్య విభేదాలు
జిలానీ, ఆయన అన్న అరెస్టు.. మళ్లీ తొలి ఏకాదశి రోజునే రషీద్ హత్య
టీడీపీపై నెపం వేసి.. నేడు వినుకొండలో జగన్ పరామర్శ యాత్ర
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా!? వైసీపీలో గ్యాంగ్ వార్ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు! హత్యా రాజకీయాలను ఖండించేందుకు! జరిగింది దారుణం.. ఘోరం! ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ... ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్ మార్కు రాజకీయం! ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా, హత్యలు జరిగినా స్పందించని జగన్...ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రం!
పక్కా గ్యాంగ్ వార్...
బుధవారం రాత్రి వినుకొండలో... నడి వీధిలో రషీద్ అనే యువకుడిని షేక్ జిలానీ అనే మరో యువకుడు హత్య చేశాడు. వీళ్లిద్దరూ ఒకప్పుడు స్నేహితులే. వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించే వాళ్లు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పీఎస్ ఖాన్ గ్యాంగ్‌లో రషీద్, జిలానీ సభ్యులు. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. గత ఏడాది తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఓ లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. పీఎ్‌సఖాన్ రషీద్‌కు మద్దతుగా నిలిచాడు. రషీద్, ఖాన్ గ్యాంగ్‌లో మరి కొందరు కలిసి గత సంవత్సరం జూలైలో జిలానీ ఇంటిపై దాడికి వెళ్ళారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో... అతని అన్న జిమ్ జానీపై దాడి చేసి గాయపరిచారు.
ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న బుల్లెట్ వాహనాన్ని కూడా తగలపెట్టారు. ఈ విషయంపై జానీ పోలీసులకు ఫిర్యాదు చేసినా... అప్పటి ఎమ్మెల్యే బొల్లా కారణంగా పోలీసులు పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా జిలానీపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. జిలానీని, ఆయన సోదరుడిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని కేసులు పెట్టారు. దీంతో... రషీద్‌పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. మళ్లీ సరిగ్గా తొలి ఏకాదశి రోజునే రషీద్‌ను చంపాలని జిలానీ పథకం రచించుకున్నాడు. కొబ్బరిబోండాల కత్తితో నడి వీధిలో రషీద్‌ను జిలానీ నరికి చంపేశాడు! ఈ హత్య వెనుక ఇంత నేపథ్యముంది! కానీ... రషీద్‌ను చంపింది టీడీపీ వాళ్లేనంటూ జగన్ రోత పత్రిక భారీ కథనాన్ని వండి వార్చింది. ఇక... జగన్ ఏకంగా వినుకొండకు ‘హత్యా రాజకీయ పరామర్శ’కు బయలుదేరుతున్నారు.
వ్యక్తిగత కక్షలే కారణం: ఐజీ, ఎస్పీ
రషీద్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని... ఇందులో రాజకీయ కోణం లేదని గుంటూరు ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, పల్నాడు ఎస్పీ కె. శ్రీనివాసరావులు తెలిపారు. గురువారం వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.
Updated Date - Jul 19 , 2024 | 07:10 AM