బలం లేకున్నా బరిలోకి
ABN, Publish Date - Nov 22 , 2024 | 03:08 AM
శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ-పీఏసీ) ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పీఏసీకి వైసీపీ నేత పెద్దిరెడ్డి నామినేషన్
ప్రజాపద్దుల కమిటీలో అసెంబ్లీ నుంచి 9 మందికి అవకాశం
ఒక్కో సభ్యుడికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం
వైసీపీకి ఉన్నది 11 మందే అయినా పోటీకి సంసిద్ధం
సంఖ్యా బలం ప్రకారమే వెళ్లాలని కూటమి నేతల నిర్ణయం
చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఖరారు!
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ-పీఏసీ) ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు.. ఈ కమిటీ చైర్మన్ పదవికి జనసేనకు చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశాయి. అయినా పెద్దిరెడ్డి పోటీలో కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఖాయమవడంతో అసెంబ్లీ అధికారులు ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ వేదికగా పనిచేసే కమిటీల్లో పీఏసీ కీలకమైనది. వివిధ ప్రభుత్వ శాఖలు పెట్టే ఖర్చుకు సంబంధించి కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఏ శాఖకు చెందిన అధికారులనైనా పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం దీనికి ఉంది. శాసనసభలో అనేక కమిటీలు ఉన్నా ఈ ఒక్క కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోం ది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్‌కు చైర్మన్ పదవి ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది.
ఈసారి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఒక సభ్యుడిని గెలిపించుకోవడానికి అవసరమైనంత బలం కూడా ఆ పార్టీకి లేదు. ఈ విషయం తెలిసినా కూటమి పార్టీలతో సంప్రదింపులు జరపకుండా పెద్దిరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చంద్రశేఖర్ కూడా వచ్చారు.
ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశాక వైసీపీ సభ్యులు సభా భవనంలోకి అడుగు పెట్టడం ఇదే ప్రథమం. పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో.. అధికార కూటమి నేతలు అంతర్గతంగా సంప్రదింపులు జరుపుకొన్నారు.
బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడంపై చర్చించారు. ఆ పార్టీని పట్టించుకోవలసిన అవసరం లేదని, సంఖ్యాబలం ప్రకారం వెళ్దామని నిర్ణయించారు. ఇటీవల గుజరాత్లో ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వని విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 182 మంది సభ్యులు ఉండగా.. స్వతంత్రులతో కలిసి బీజేపీకి 163 మంది ఉన్నారు. కాంగ్రె్‌సకు 12, ఆమ్ ఆద్మీ పార్టీకి నలుగురు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పీఏసీకి ఒక్కరిని కూడా గెలిపించుకునే బలం కాంగ్రె్‌సకు లేకపోవడంతో ఆ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వలేదు. అదే సంప్రదాయాన్ని ఆంధ్రలో కూడా పాటించాలని కూటమి నేతలు నిశ్చయించారు. ఆ తర్వాత శాసన మండలి ఛైర్మన్ చాంబర్లో శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో ప్రతిపక్షమైన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. చాలినంత సంఖ్యాబలం వైసీపీకి అసెంబ్లీలో లేనందువల్ల ఆ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి గానీ, సభ్యత్వం గానీ ఇవ్వలేమని కేశవ్ చెప్పారు.
సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వాలని, దానిని పాటించాలని బొత్స కోరారు. ‘ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇటీవల స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీ నుంచి మీరు పోటీ చేశారు. బలం లేదని మేం అసలు పోటీయే చేయలేదు. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో మీ పార్టీకి కనీసం ఒక సభ్యుడిని గెలిపించుకునేంత బలం ఉంటే మేం తప్పనిసరిగా చైర్మన్ పదవి ఇచ్చేవాళ్లం. మీకు ఆ బలం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అందువల్ల ఇవ్వలేకపోతున్నాం’ అని కేశవ్ స్పష్టంచేశారు. ఆ సమావేశం అనంతరం కూటమి నేతల అంతర్గత సమావేశంలో పీఏసీ చైర్మన్ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఆ పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును ఎంపిక చేశారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఆయన వియ్యంకుడు. ఈ కమిటీలోకి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య(జగ్గయ్యపేట), జయనాగేశ్వర్‌రెడ్డి (ఎమ్మిగనూరు), అరిమిల్లి రాధాకృష్ణ (తణుకు), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు), నక్కా ఆనందబాబు (వేమూరు), కోళ్ల లలితకుమారి(ఎ్‌స.కోట)లను ఎంపిక చేసి వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. జనసేన నుంచి పులపర్తి, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు వేశారు. అసెంబ్లీ నుంచి పీఏసీలో 9 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా కూటమి పార్టీలు తొమ్మిది మందితో నామినేషన్లు వేయించాయి. వైసీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
జగన్ వస్తారా.. లేదా?
పీఏసీ పోలింగ్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా రారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఏదైనా కారణం వల్ల కూటమి ఎమ్మెల్యేలు పది మంది స్థానికంగా అందుబాటులో లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ఓట్లు వేస్తారని.. కూటమి ఎమ్మెల్యేలు చాలినంత మంది ఉంటే ఓటింగ్‌కు రారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మండలి సభ్యులపై అంగీకారం
శాసన మండలి నుంచి పీఏసీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా వాటి విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య అంగీకారం కుదిరింది. బలాబలాల ఆధారంగా వైసీపీకి రెండు స్థానాలు, టీడీపీకి ఒక స్థానం దక్కనుంది. మరో రెండు అసెంబ్లీ కమిటీల అధ్యక్ష పదవులకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా టీడీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్, అంచనాల కమిటీ చైర్మన్‌గా టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల
జోగేశ్వరరావును ఎంపిక చేశారు.
Updated Date - Nov 22 , 2024 | 03:13 AM