AP Elections: పల్నాడులో కొనసాగుతోన్న వైసీపీ విధ్వంసకాండ..!!
ABN, Publish Date - May 15 , 2024 | 03:48 AM
పోలింగ్ ముగిసినప్పటికీ పల్నాడులో ప్రతీకార దాడులకు వైసీపీ మూకలు తెగబడుతూనే ఉన్నాయి.
పోలింగ్ మర్నాడు కారంపూడిలో బీభత్సం
టీడీపీ కార్యాలయం, వాహనాలు ధ్వంసం
టీడీపీ కార్యకర్తల ఇళ్లు, షాపులపై రాళ్లవర్షం
వందలాదిగా వెళ్లి ‘టీడీపీ’ గ్రామాల్లో బీభత్సం
హింసాకాండకు వైసీపీ అభ్యర్థుల నేతృత్వం
దగ్గరుండి దాడులు చేయించిన కాసు, అనిల్
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
పోలింగ్ ముగిసినా ప్రతీకార దాడులకు వైసీపీ మూకలు తెగబడుతూనే ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చున్నవారిని, అభ్యర్థులను, పోలింగ్ బూత్‌లకు రక్షణ కల్పించిన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని వరుసగా రెండోరోజు కూడా విధ్వంసకాండ సాగింది. చివరకు ఓటర్లపైనా వైసీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ‘మాసైకిల్ జోరు పెరిగింది’ అంటూ టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేసిన ఓ వృద్ధుడిపై శ్రీకాకుళంలో దాడిచేశారు. కూటమికి ఓటువేశాడనే అనుమానంతో కౌలురైతుపైనా కర్ర ఎత్తడం అధికార పార్టీ నేతల బరితెగింపునకు పరాకాష్ఠ! తిరుపతిలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించి బయటకువస్తున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీని సృహ తప్పిపోయేంతగా వైసీపీ రౌడీలు కొట్టారు. పోలింగ్ జరిగిన మర్నాడు కూడా పల్నాడులో అరాచకం రాజ్యం చేసింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. సోమవారం పోలింగ్ సందర్భంగా గాయపడిన వైసీపీ కార్యకర్తల పరామర్శకు అన్నట్టు వెళ్లి.. ఆ గ్రామంలో కర్రలు, మరణాయుధాలతో వీరంగం సృష్టించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లను ఎంచుకుని మరీ దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు ఈ దాడులను గట్టిగా ప్రతిఘటించడంతో కొన్నిగంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. వరుస దాడుల నేపథ్యంలో పల్నాడులో 140 సెక్షన్ విధిస్తూ కలెక్టరు శివశంకర్ ఆదేశాలు జారీచేశారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధంలో ఉంచారు. వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు ప్రత్యేక కమిటీని చంద్రబాబు ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణ, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.
బీభత్సకాండ
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నవారిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మూకలు విరుచుకుపడ్డాయి. ఓబుళనాయునిపల్లిలోని వారి ఇళ్లపై రాళ్లవాన కురిపించాయి. ఈ దాడిలో గాయపడినవారిని ఆస్పత్రిలో ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ పరామర్శించారు. బాపట్ల జిల్లా పడమర పిన్నిబోయనవారిపాలెంలో టీడీపీకి ఎక్కువగా ఓటింగ్ జరిగిందనే కోపంతో ఆగ్రామంపై వైసీపీ గూండాలు దాడిచేశారు. అక్కడి ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టారు. స్థానికనేత నర్రా కొండలుపై దాడిచేశారు. శ్రీకాకుళంజిల్లా పలాసలోని అమల ుకుడియాకు చెందిన బూర్జ అప్పలస్వామి అనే వృద్ధుడు.. సోమవారం పోలింగ్‌కేంద్రంలో టీడీపీ అను కూల వ్యాఖ్యలు చేశారు ఆ కోపంతో ఇంటికెళ్లి కొట్టారు.
పోలీసులనూ వదిలిపెట్టలేదు..
ఎమ్మెల్యే పిన్నెలి సోదరుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకలు కారంపూడిలో కొన్ని గంటలపాడు వీరంగం చేశాయి. మంగళవారం వెంకట్రామిరెడ్డి పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తూ మధ్యలో కారంపూడిలో ఆగారు. ఆ తర్వాత కొద్దిసేటికే టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను, సమీపంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. రోడ్డు పక్కన నిలిపిన తెలుగుదేశం నేత జానీబాషా వాహనానికి నిప్పు పెట్టాయి. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై రాళ్లు పడ్డాయి. దాడులను ఆపేందుకు ప్రయత్నించిన కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా వైసీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బీసీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతో రక్తం కళ్ల చూశారు.
ఒక్కొక్క నా కొ....ని ఏం చేయాలో చేద్దాం!
పోలీసులనుద్ధేశించి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు
చిత్తూరు, మే 14(ఆంధ్రజ్యోతి): ‘మన దళిత జాతికి మనమే సైనికుల్ల్లా నిలబడదాం. ఒక్కొక్క నా కొ....ని ఏమి చేయాలో అది చేద్దాం. మనకు ఎవరూ వద్దు. ఈ ఎస్పీ పని చేయడానికి వచ్చాడో లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పుల్లూరు దళితవాడలో మంగళవారం జరిగిన గొడవపై గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డీఎస్పీకి ఫోను చేస్తే ఎలక్షన్ అవ్వగానే మీ కూతురే గెలుస్తుందని, అప్పుడు వాళ్లని తొక్కేస్తానని అన్నాడు. సీఐ, ఎస్‌ఐలకు ఫోన్ చేస్తే మేమేం చేసేది సార్.. ఎస్పీ వన్‌సైడ్ చేయమన్నాడు అని చెప్తున్నారు. ఇంతవరకు బాగున్నవాళ్లు కూడా ఈ ఎస్పీ వచ్చాక వన్ సైడ్ ఉండమన్నాడని చెప్తున్నారు. ఇక మనకు మనమే దిక్కు. పోలీసు ప్రొటెక్షన్ అవసరం లేదు’ అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
Updated Date - May 15 , 2024 | 12:18 PM