Share News

ధరల పోటీ తట్టుకోలేక పోతున్నాం

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:00 AM

ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) అమ్మకానికి దారితీసిన పరిస్థితులను ఆ సంస్థ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ తనకు సన్నిహితులైన 300 మంది ఉద్యోగులతో పంచుకున్నారు...

ధరల పోటీ తట్టుకోలేక పోతున్నాం

అందుకే ఇండియా సిమెంట్స్‌ను అమ్మేశా: ఎన్‌.శ్రీనివాసన్‌

చెన్నై: ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) అమ్మకానికి దారితీసిన పరిస్థితులను ఆ సంస్థ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ తనకు సన్నిహితులైన 300 మంది ఉద్యోగులతో పంచుకున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి ధరల విషయంలో పోటీ సంస్థలతో పోటీపడలేకే కంపెనీని అమ్మాల్సి వచ్చిందని వారితో భావోద్వేగంతో చెప్పారు. కంపెనీ యాజమాన్యం చేతులు మారినా ఐసీఎల్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, భూములు అమ్మేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదన్నారు. కంపెనీ అమ్మకానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ‘ధరలు తగ్గించి మన పోటీ సంస్థలు మనల్ని తొక్కేయగలవు. వారితో పోలిస్తే మన ఉత్పత్తి వ్యయం కొద్దిగా ఎక్కువ. దాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయాత్నాలు పెద్దగా ఫలించలేదు. అందుకే ఇండియా సిమెంట్స్‌ను అమ్మేయాల్సి వస్తోంది’ అని శ్రీనివాసన్‌ తనను కలిసిన ఉద్యోగులతో భావోద్వేగంతో చెప్పారు. దీంతో గత 55 సంవత్సరాలుగా సిమెంట్‌ పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధం ముగియబోతోంది.'


లిస్టెడ్‌ కంపెనీగానే ఐసీఎల్‌: ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) షేర్లను డీలిస్ట్‌ చేసే ఆలోచన లేదని అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటా తమ హస్తగతమైనా.. ఐసీఎల్‌ ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ఐసీఎల్‌ ప్రధాన ప్రమోటర్‌ ఎన్‌ శ్రీనివాసన్‌, ఆయన కుటుంబసభ్యుల నిర్వహణలోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) యాజమాన్యంలోనూ ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది. ఐసీఎల్‌ ఈక్విటీలో మరో 26 శాతం వాటా కోసం తాము చేసే ఓపెన్‌ ఆఫర్‌ను యాక్సిస్‌ క్యాపిటల్‌ నిర్వహిస్తుందని తెలిపింది.

Updated Date - Jul 30 , 2024 | 04:00 AM