Share News

Zomato: కొత్త బిజినెస్‌లోకి జొమాటో.. పేటీఎంతో జరుగుతున్న చర్చలు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 09:37 PM

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm) వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.

Zomato: కొత్త బిజినెస్‌లోకి జొమాటో.. పేటీఎంతో జరుగుతున్న చర్చలు!

ఇంటర్నెట్ డెస్క్: నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm) కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అడుగులు వేస్తోంది. పేటీఎంపై సినిమాలు, ఈవెంట్ల టికెట్‌ బుకింగ్‌ వ్యాపారాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం విలువ రూ.1,500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. ఆర్బీఐ ఆంక్షల ప్రభావంతో పేటీఎం షేర్లు ఇటీవల భారీగా క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ కార్యరూపం దాల్చితే జొమాటో చరిత్రలోనే ఇది రెండవ అతి పెద్ద ఒప్పందంగా నిలిచిపోనుంది.


2022లో జొమాటో ‘బ్లింకిట్’ని రూ. 4,447 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా ఫుడ్ డెలివరీతో పాటు నిత్యవసర సరకులు, వినోద రంగంలో కూడా తన మార్క్ చూపించాలని భావిస్తున్న జొమాటోకు పేటీఎంతో డీల్ కలిసి రావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూవీ, ఈవెంట్ టికెటింగ్‌లో ఆదరణ పొందిన బుక్ మై షోకు పోటీగా పేటీఎం నిలిచిందని గుర్తుచేస్తున్నారు.

ఈ క్రమంలోనే పేటీఎం మార్కెటింగ్‌ సర్వీసెస్‌లో భాగమైన మూవీస్, ఈవెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పేటీఎంతో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు ఎలాంటి అధికారికంగా ప్రకటించలేదు. పేటీఎం One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.

Updated Date - Jun 16 , 2024 | 09:53 PM