Share News

Chidambaram: ప్రజా తీర్పుపై క్రూర పరిహాసం

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:16 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Chidambaram: ప్రజా తీర్పుపై క్రూర పరిహాసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


జూన్ 9న పదవీ ప్రమాణస్వీకారం చేసిన కొత్త ప్రభుత్వం కథను సంగ్రహంగా ఇలా చెప్పవచ్చు: ప్రజలు మార్పు కోసం ఓటు వేశారు, నరేంద్ర మోదీ అవిచ్ఛిన్నతను ఎంచుకున్నారు. ఓటర్లకు ఇంగిత జ్ఞానం సమృద్ధిగా ఉన్నది. కనుకనే మార్పు కోసం ఓటు వేశారు సరైన తీర్పునిచ్చారు. గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అనుసరించిన పాలనా నమూనాను వారు తిరస్కరించారు. అయితే నరేంద్ర మోదీకి మరో అవకాశాన్ని ఇచ్చారు. ఆయన తన ప్రభుత్వ విధానాలలో మౌలిక మార్పులు తీసుకురావాలని, తీసుకురాగలరని వారు భావిస్తున్నారు. బీజేపీ 303 సీట్లతో ఈ సార్వత్రక ఎన్నికల గోదాలోకి దిగింది. తను సొంతంగా 370 సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. తన నేతృత్వంలోని ఎన్డీఏకు 400కు పైగా సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ రెండు లక్ష్యాలు నెరవేరగలవని ప్రధాని మోదీతో సహా బీజేపీ శ్రేణులు నిండుగా విశ్వసించాయి. అయితే వారి ఆశలు ఘోరంగా వమ్మయ్యాయి. బీజేపీ అంతిమంగా 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కనీస మెజారిటీ కూడా దక్కలేదు. ఇక ఎన్డీఏ 292 సీట్లతోనే సరిపెట్టుకోవలసివచ్చింది. ఈ తీర్పుతో బీజేపీకి ప్రజలు పంపించిన సందేశమేమిటో స్పష్టమే : సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. భాగస్వామ్య పక్షాలకు కీలక బాధ్యతలు అప్పగించండి. ప్రజల్లో విభేదాలు, విభజనలను సృష్టిస్తున్న విధానాలను విడనాడండి. ఆర్థిక రంగ వాస్తవ పరిస్థితులను అంగీకరించండి. సామాజిక వైమనస్యతలను రూపుమాపండి. పాలన గురించి డాబుసరి మాటలను కట్టిపెట్టండి. ఆచరణాత్మకం కాని హామీలు ఇవ్వొద్దు. సమస్త భారతీయులనూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లండి.


ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, కేంద్రంలో అధికరాన్ని కైవసం చేసుకోవడానికి దృఢ సంకల్పంతో పోరాడిందనే అభిప్రాయానికి ఓటర్లు వచ్చారు. అయితే ఆ పార్టీ బహుశా బృహత్తర పాలనా బాధ్యతలకు సన్నధం కాలేదని కూడా ఓటర్లు భావించినట్టున్నారు. 170 లోక్‌సభా నియోజకవర్గాలు ఉన్న 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ తన పునాదులను తిరిగి పటిష్ఠం చేసుకోవలసి ఉన్నది. ఆ రాష్ట్రాలలో పార్టీ పెరుగుదలకు గల అనుకూలతలను కంగ్రెస్ సద్వినియోగపరచుకోవలసి ఉన్నది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షరతులతో కూడిన ప్రజామోదాన్ని నరేంద్ర మోదీ పొందారు. అయితే ప్రజా తీర్పుపై వ్యక్తమైన ప్రజల అభీష్టాన్ని ఆయన గుర్తించలేదు. ఈ దురహంకారం మోదీకి స్వాభావికమైనదని మరి చెప్పనవసరం లేదు. ఎన్నికల ఫలితాలపై తొలి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న వెంటనే తనను సవాల్ చేయగల నేతలు బీజేపీలో లేరన్న వాస్తవాన్ని గుర్తించారు. మరి ఏ ఇతర పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలం లేదన్న యథార్థాన్నీ అర్థం చేసుకున్నారు.


సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 99 సీట్లను కైవసం చేసుకున్నది. వీటిలో 79 కేవలం తొమ్మిది రాష్ట్రాలలో మాత్రమే ఉన్నాయి. 170 నియోజకవర్గాలు ఉన్న మరో తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకున్నది (ఐదు రాష్ట్రాలలో ఒక్క సీటు కూడా రాకపోగా మిగతా నాలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సీటును సాధించుకున్నది) 79 సీట్లను ఇచ్చిన తొలి తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ చేసిన మంచి ఏమిటి? కేవలం ఐదు స్థానాలను మాత్రమే ఇచ్చిన మరో 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ చేసిన చెడు ఏమిటి? ఉదయ్‌పూర్, రాయపూర్‌లలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులలో సార్వత్రక ఎన్నికలలో విజయ సాధనకు సన్నాహక కృషి జరిగింది. అయితే ఆ కృషిని తార్కిక అంతానికి తీసుకువెళ్లి, అధికారాన్ని కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమయింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఈ మూడు రాష్ట్రా లలో మరి కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో గెలుచుకున్న సీట్ల ప్రాతిపదికన చూస్తే కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో పాటు బీజేపీ కంటే ముదంజలో ఉన్నది. ఈ మూడు రాష్ట్రాలలోను అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అవకాశాలు సమృద్ధంగా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావాన్ని తప్పక చూపుతాయి కనుక ఆ మూడు రాష్ట్రాలను కోల్పోయేందుకు బీజేపీ ఇష్టపడదు. కనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలకు తీవ్ర పోటీనిస్తుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మూడు రాష్ట్రాలలోనూ గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి పోరాడాలి. మార్పు కంటే ప్రభుత్వ విధానాల కొనసాగింపు క్రమాన్నే ఎంచుకున్నారు తద్వారా ఆయన అనుద్దేశపూర్వకంగా క్లిష్ట పరిస్థితులను సృష్టించుకున్నారని చెప్పవచ్చు. మోదీ మూడో ప్రభుత్వ మంత్రిమండలి కూర్పు మంత్రిత్వ శాఖల కేటాయింపు నుంచి అనేక నిర్ధారణలకు రావచ్చు.


అవేమిటో చూద్దాం. 1) ప్రభుత్వ విధానాలలోను, తన పాలనా శైలిలోను మౌలిక మార్పులు రావాలన్న ఓటర్ల హెచ్చరికను మనసున పెట్టుకునేందుకు మోదీ నిరాకరించారు. 2) తన ప్రభుత్వ మౌలిక విధానాలలో అపసవ్యతలు లేవన్న వైఖరిని మోదీ దృఢంగా వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధి, అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన విధానాలు దేశ ప్రయోజనాలను సంపూర్ణంగా కాపాడుతున్నాయని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ౩) తన మూడో ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో నడుస్తుందన్న వాస్తవాన్ని అంగీకరించిన వారికి తన కేబినెట్‌లో స్థానముంటుందని మోదీ స్పష్టం చేశారు. 5) ప్రభుత్వంలో మిత్రపక్షాలకు గౌరవప్రదమైన పాత్ర కల్పించకుండానే వాటిని తమపక్షాన ఉంచుకునేందుకు అవసరమైన సకల వనరులు తనకు, అమిత్ షాకు ఉన్నాయన్న ధీమా మోదీలో బాగా వ్యక్తమవుతోంది.

మంత్రులు ఎవరూ ఇంతవరకు తమ ప్రాథమ్యాలు, విధానాల గురించి మాట్లాడలేదు. పి.కె. మిశ్రాను ప్రిన్సిపల్ సెక్రటరీగాను, అజిత్ డోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగాను నియమించారు. ఈ నియామకాలతో మోదీ ప్రభుత్వం మార్పులేకుండా అదే విధంగా కొనసాగుతుందనే విషయం సందిగ్ధతకు తావులేకుండా ధ్రువీకరణ అయింది. ఈ కొత్త ప్రభుత్వం నిస్సందేహంగా మోదీ 3.0 కాదు, అది మోదీ 2.1 మాత్రమే.


ప్రజలు తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచే మార్పును ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ధరల స్థిరీకరణ, భద్రత, శాంతి సామరస్యాల కోసం ఓటు వేశారు. మరి పాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులే ఈ కొత్త సర్కార్‌లోనూ కొనసాగుతున్నారు. గతంలో వారు ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహించారో ఇప్పుడూ అవే శాఖలకు సారథ్యం వహిస్తున్నారు. మరి విధానాలో? అవే. పాతవే. మార్పు లేనివి, మారనివి. ఈ యథాతథ పరిస్థితి ప్రజాతీర్పుపై క్రూర పరిహాసమే అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కొత్త ప్రస్థానం మొదటి అడుగు– ప్రభుత్వం ఏర్పాటు– లోనే తడబడ్డారు. దేశ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలు ఆశాజీవులు. మరి కేంద్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ తన రెండవ, మూడవ అడుగులు– పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమర్పణ– ఎలా ఉండనున్నాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

చిదంబరం

వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు

Updated Date - Jun 15 , 2024 | 02:16 PM