RK Kothapaluku: జనం కంటకం.. జగన్ నాటకం!
ABN, Publish Date - Feb 25 , 2024 | 01:59 AM
‘‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు లేవు!’’ – ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసిన నివేదికలో...
‘‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandrababu) అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు లేవు!’’ – ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసిన నివేదికలో పేర్కొన్న విషయమిది. రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదనీ, అభివృద్ధి మచ్చుకు కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన పాలన అద్భుతంగా ఉందని జబ్బలు చరుచుకుంటున్న జగన్‌రెడ్డికి ఈ నివేదికలోని అంశాలు సహజంగానే రుచించవు. తన ప్రభుత్వాన్ని విమర్శించేవారు ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లు కూడా కాదని, పొరుగు రాష్ర్టాల్లో నివసించే వారే విమర్శిస్తుంటారని ముఖ్యమంత్రి శుక్రవారం నాడు ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఉన్నవీ లేనివీ చెప్పడం సహజమే కానీ జగన్మోహన్ రెడ్డిలా పచ్చి అబద్ధాలు చెప్పేవారిని ఇప్పుడే చూస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి కూడా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినందున ఆయనను కూడా మన రాష్ర్టానికి చెందినవాడు కాదని దాడి ప్రారంభించినా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. తన సభలకు తీసుకు వస్తున్న జనాలందరూ వెర్రిబాగులోళ్లు అని భావించే ముఖ్యమంత్రి, చెప్పిన అబద్ధం చెప్పకుండా తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబులాంటి వాడు రాజకీయాలలో ఇంకా కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోందని జగన్మోహన్ రెడ్డి తాజాగా సెలవిచ్చారు. చంద్రబాబు విధానాలతో, రాజకీయాలతో విభేదించే వాళ్లు కూడా ఆయన రాజకీయాలలో ఉండదగిన వ్యక్తి కాదని విమర్శించే సాహసం చేయరు. జగన్ రెడ్డే రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. ఒక్క జగన్ మాత్రమే చంద్రబాబు రాజకీయాలలో ఉండడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే ఆయన రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా సరదాగా చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించే సాహసానికి ముఖ్యమంత్రి ఒడిగట్టారు. రాజకీయాల నుంచి చంద్రబాబు రిటైర్ కావాలని ఆయన సతీమణి స్వయంగా కోరుకుంటున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలను గమనిస్తే... తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారెవరూ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదనీ, రాష్ర్టాన్ని తనకు, తన భార్యకు అప్పగించేసి అందరూ రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఉంది. తనను తాను పేదల ప్రతినిధిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అడుగు బయటపెట్టాలంటే రెండు హెలికాప్టర్‌లు సిద్ధంగా ఉండాలి మరి!
బడాయి బిల్డప్‌లు...
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు రాష్ట్రంలో పేద ప్రజలకు ఆంగ్ల భాషే రాదన్నట్టుగా జగన్ బిల్డప్ ఇస్తున్నారు. ‘సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్’ అన్నట్టుగా ఆంగ్ల భాష వస్తే చాలు అన్నీ వచ్చి పడిపోతాయి అన్నట్టుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. అమెరికన్లు మాట్లాడేది ఆంగ్లంలోనే కదా? అయినా ఆ దేశంలో మన దేశానికి చెందినవారు ఉన్నత స్థానాల్లో ఉండటానికి కారణం ఏమిటో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? అంతెందుకు... కేరళ, తమిళనాడు, కన్నడిగులకు ఆంగ్ల భాషపై పట్టు లేదా? అయినా వాళ్లు తమ మాతృభాషను విస్మరించడం లేదే? ఇంగ్లీష్ భాషతోపాటు తెలుగు భాషను కూడా ప్రోత్సహించాలని, మాతృభాషను మృత భాషగా మార్చకూడదని చెప్పడమే పాపమన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని జగన్‌రెడ్డి చేయడం విడ్డూరంగా ఉంది. తెలుగు భాషలో మాట్లాడే వారికంటే తక్కువ జనాభా ఉన్న అనేక యూరోపియన్ దేశాలు తమ మాతృభాషను విస్మరించడం లేదు కదా? స్పానిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చుకునేందుకు మన పిల్లలు ఉత్సాహపడటం లేదా? ప్రజలు సొంతంగా ఆలోచించకూడదని, వాళ్లు తమ కాళ్ల మీద తాము ఆధారపడకూడదన్నది ముఖ్యమంత్రి అభిప్రాయంగా కనిపిస్తోంది. అడుగడుగునా వంచనతో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపించడంతో.. ‘నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అనే పాట అందుకున్నారు. దళిత జనోద్ధారణకు జీవితాంతం కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఇంతలా బిల్డప్ ఇచ్చుకోలేదు. ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు కనుక జగన్‌రెడ్డిలా సొల్లు మాటలు చెప్పలేదు.
ఓట్ల కోసం ‘నా... నా’ రాగాలు
బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలి కనుక జగన్మోహన్ రెడ్డి ‘నా’ అనే పాట పాడుతుంటారు. తన పల్లకి మోసే బోయీలుగానే ఆ వర్గాలు ఉండిపోవాలని ఆయన కోరుకుంటారు. అందుకే అధికార కేంద్రాల దరిదాపుల్లోకి కూడా వారెవరినీ రానివ్వరు. అంతెందుకూ... రాజకీయంగా, ప్రభుత్వపరంగా తన తరఫున వ్యవహారాలను చక్కదిద్దుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎంత మంది ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి ఎవరు? పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎవరు? తనకు నెల నెలా వసూళ్లు చేసి పెడుతున్న గనుల శాఖ డైరెక్టర్ వెంకట రెడ్డి, మద్యం సరఫరా చేసే సంస్థ ఎండీ వాసుదేవ రెడ్డి ఎవరు? వీళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎందుకు లేరు? అంటే ఆ వర్గాలలో సమర్థులు లేరా? లేక వారిపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా? ఊరి వెలుపల దళితవాడలను ఏర్పాటు చేసినట్టుగా తాడేపల్లి ప్యాలెస్‌కు దళిత వర్గాలు ఆమడ దూరంలో ఉండాల్సిందే. ఆయా వర్గాలను మభ్యపెట్టేందుకు విధిలేని పరిస్థితులలో కొన్ని పదవులు కట్టబెట్టినా, వారిని అధికార కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదే? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు నిజంగా నీ వాళ్లయితే ఆ వర్గాలతో వియ్యం అందుకోగలవా, బంధుత్వం పెట్టుకోగలవా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే తప్పేమిటి? ఐదేళ్లలో అక్క చెల్లెమ్మలకు రెండున్నర లక్షల కోట్లు పంచిపెట్టానని జగన్ గొప్పలు చెప్పుకొంటున్నారు. అయిదేళ్లలో ఐదు లక్షల కోట్లు అప్పు చేసి రెండున్నర లక్షల కోట్లు పంచడం గొప్పా? ఈ ఐదేళ్లలో తన జేబు నుంచి ఒక్కరికైనా పది రూపాయలు సహాయం చేశానని జగన్‌రెడ్డి చెప్పగలరా? ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి కంపెనీల లాభాలు పెరిగినట్టుగా పేదల ఆదాయం ఎందుకు పెరగలేదు? బటన్లు నొక్కడం వల్ల ఒక్క పేదవాడైనా పేదరికం నుంచి బయటకు వచ్చి పన్ను కట్టే స్థాయికి ఎదిగాడా? అదే నిజమైతే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తగ్గుతూ రావాలి కదా?
దాడులకా ‘సిద్ధం’?
జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగా గొప్పగా ఉంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు, మీడియా మీద పడి ఏడవడం ఎందుకు? జనం కళ్లలోకి సూటిగా చూస్తూ అలవోకగా అబద్ధాలు చెప్పగలిగేది ఎవరంటే, జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవలసి ఉంటుంది. జనం నెత్తి మీద కూర్చొని ‘మీ సేవకుడిని’ అని గొప్పలు పోగలిగేవాడు, ఇల్లు గుల్ల చేస్తూ ‘మీ సేవకుడిని’ అని మభ్యపెట్టగలిగేవాడు, చేతికీ నోటికీ తాళం వేసి ఎంత స్వేచ్ఛ అనుభవిస్తున్నావో చూడు అని నమ్మించగలిగేవాడు, కొంపకు నిప్పు పెట్టి చలిమంట వేశాను – చలి కాచుకోమని బురిడీ కొట్టించగలవాడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి హావభావాలను జాగ్రత్తగా గమనించిన వారికి ‘నేను ముఖ్యమంత్రిని అయ్యానా?’ అన్న అనుమానం అతడిలో అప్పుడప్పుడూ కలుగుతుందని మనకు తెలిసిపోతుంటుంది. అందుకే తన లాంటి వాడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన జనాలను ఆయన వెర్రిబాగులోళ్లుగా పరిగణిస్తున్నారు. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతుంటారు. ముఖ్యమంత్రి నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీడియాపై కత్తిగట్టారు. సొంత మీడియాకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆంధ్రజ్యోతి, ఈనాడు అని శోకాలు పెడుతుంటారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడులకు తన వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి, ఈనాడుకు వ్యతిరేకంగా ‘మీరు సిద్ధమేనా?’ అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో అసలే మద్యం మత్తులో ఉన్న ఉన్మాద మూక రెచ్చిపోయింది. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణను దారుణంగా హింసించారు. సొంత మీడియా కలిగి ఉండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు దంచిన జగన్‌రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపం బయటపెట్టుకుంటున్నారు. రేపు రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తన మీడియాలో పనిచేసే వారిపై ఇటువంటి దాడులు జరిగితే జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి తర్వాత వైసీపీ అధికారికంగా వెలిబుచ్చిన అభిప్రాయం మరీ దారుణంగా ఉంది. ‘ప్రజల అభిప్రాయం తీసుకొని వార్తలు రాస్తే అందరూ హర్షిస్తారు. కానీ.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రభుత్వం కాదు, ప్రజలే బుద్ధి చెబుతారు’ అని వైసీపీ ‘ఎక్స్’ ద్వారా సెలవిచ్చింది. అంటే, రాష్ట్రంలోని మీడియా సంస్థలన్నీ ఆ రోత పత్రిక, ఆ రోత చానల్‌కు అనుబంధంగా మారిపోయి ప్రస్తుత కూలి మీడియా బాటలో ముఖ్యమంత్రి భజన చేస్తూ వాళ్లు విసిరే ఎంగిలి మెతుకులు తినడానికి అలవాటుపడాలని కోరుకుంటున్నారన్న మాట! రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకే ఉండకూడదని అనుకోవడం, ప్రజలందరూ మూకుమ్మడిగా మద్దతు ఇవ్వాల్సిందే అని భావించడం, తప్పులు ఎత్తి చూపే ప్రతిపక్షం, మీడియా ఉండకూడదని కోరుకోవడం నియంతృత్వం కాదా? ముఖ్యమంత్రికి ఎక్కడో ఓటమి భయం పట్టుకుంది. అందుకే మీడియాపైకి తన ఉన్మాద మూకలను ఉసిగొల్పుతున్నారు. రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే కాళ్లు విరిచే వారు అని కొడాలి నాని వంటి పిచ్చివాళ్లు వాగుతున్నారంటే ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియడం లేదా? తాను అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా జగన్‌రెడ్డి చేస్తున్న ప్రచారం నిజమైతే... రాజశేఖర రెడ్డి ఐదున్నరేళ్ల పాలన కూడా దరిద్రంగా ఉన్నట్టే కదా? అలాంటప్పుడు రాజన్న రాజ్యం తెస్తామని ఎన్నికల్లో చెప్పడంలోని ఔచిత్యం ఏమిటి? పేదల ప్రతినిధికి విలాసవంతమైన రాజ ప్రాసాదాలు ఊరూరా ఎందుకో చెబుతారా? విశాఖపట్నంలో తన నివాసం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు చేసి మరో విలాసవంతమైన భవనం నిర్మించుకోవడంలో ఔచిత్యం ఏమిటి? పేదలు మాత్రం సెంటు స్థలంలోనే ఇల్లు కట్టుకొని రాజప్రాసాదంగా భావించాలని కోరుకోవడం వంచన కాదా? నీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలిగానీ పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుకోవడం పేదల ప్రతినిధి చేసే పనేనా? నీ కుమార్తెల వలె పేదల పిల్లలను కూడా ప్యారిస్, లండన్‌లో చదివించవచ్చు కదా? ఇలా ప్రశ్నిస్తామనే దాడులకు తెగబడుతున్నారు. నీ సొంత చెల్లి ఇప్పుడు నిన్ను కడిగిపారేస్తున్నారు కదా, నీ నిజ స్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కదా! ఇప్పుడు ఆమెపై కూడా దాడులు చేయిస్తారా? మీడియాపైకి ప్రజలే తిరగబడుతున్నారని చెబుతున్నారు కదా, అదే నిజమైతే, ప్రజల్లో నిజంగా అంత చైతన్యమే ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో తరిమికొట్టేవారు. అసలు ఆయనను ముఖ్యమంత్రి పీఠంపైనే కూర్చోబెట్టేవారు కారు. తాను ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నారో అప్పుడే ప్రజలు ఉత్త అమాయకులని, వారిని పదే పదే బురిడీ కొట్టించవచ్చునని జగన్మోహన్ రెడ్డి నిర్ధారణకు వచ్చారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేసి చలి కాచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అమరావతిని చంపేసి, మూడు రాజధానుల పాట పాడుతూ ఐదేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు మరికొంత కాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనడం ప్రజలు అమాయకులు, ఏదీ పట్టించుకోరనే కదా? రాష్ట్రం కర్మ కాలి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే వాషింగ్టన్ రాజధానిగా ఉండాలని వాదిస్తారేమో తెలియదు. ఏది ఏమైనా మీడియాపై మీ ఉన్మాద మూకలు చేయబోయే దాడులను ఎదుర్కోవడానికి మేం కూడా సిద్ధం. నియంతృత్వ పోకడలను, కపట విన్యాసాలను మేం ప్రశ్నిస్తూనే ఉంటాం!
బీజేపీ పాత్ర ఏమిటో!?
తెలుగు రాష్ర్టాలలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి పాత్ర పోషించబోతోంది అన్నది ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనతో చేతులు కలుపుతామని చెప్పి పదిహేను రోజులు దాటినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి కోరికను మన్నించి ఈ రెండు పార్టీలతో పొత్తుకు ప్రధాని మోదీ విముఖత వ్యక్తం చేస్తారా? అన్న అనుమానం ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతోంది. రేపో మాపో కబురు చేస్తామంటూ పక్షం రోజులు గడచినా బీజేపీ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నా లేకపోయినా కలిసే వెళ్లాలని తెలుగుదేశం–జనసేన నిర్ణయించుకున్నాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవుతున్నందున బీజేపీతో కలవాల్సిన పరిస్థితి ఈ కూటమికి ఏర్పడుతోందన్నది బహిరంగ రహస్యమే. ప్రస్తుతానికి బీజేపీ కేంద్ర నాయకత్వం గుంభనంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ పెద్దలు తమ వైఖరి స్పష్టం చేసే అవకాశముంది. ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టత వస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. పొత్తు ప్రతిపాదనలతో వచ్చిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల వద్ద బీజేపీ పెద్దలు తమ వైఖరి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చునన్నది వారి ఆలోచన. బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నిజంగా దెబ్బతింటే దాని ప్రభావం ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైన కూడా పడుతుంది. బీఆర్‌ఎస్ దెబ్బ తింటే బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. బీజేపీతో బీఆర్‌ఎస్ కూడా ఎంతో కొంత బలంగా నిలబడటం కాంగ్రెస్ పార్టీకి అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తమకు ఢోకా లేదన్న భరోసాతో ఉండింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ బలహీనపడటంతో కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కోల్పోకుండా మనగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా కవచంలా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముఖ్యులు కూడా గుర్తించారు. తాజా సర్వేల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రథమ స్థానంలో, బీజేపీ ద్వితీయ స్థానంలో, బీఆర్‌ఎస్ తృతీయ స్థానంలో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్‌కు శక్తికి మించిన పనే. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి వారు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశముంది. ఈ ఇరువురూ గెలిస్తే, వారిలో ఒకరు కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తమకు అధికారం వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించి ఉన్నందున రేసులో ఈటల, బండి ఉంటారు. ఏ కారణం వల్లనైనా ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని భావించలేం. ఛండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో చూశాం. సుప్రీంకోర్టులో విచారణ జరిగి ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిని మేయర్‌గా ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోదీ కూడా నైతికత కంటే గెలుపునకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాలలో రుజువైంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న విషయమై ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి కాలం అధికారంలో కొనసాగనిస్తారా? అన్న సందేహం పలువురిలో ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఏమి జరుగుతున్నదో తెలుసు. బీజేపీ నుంచి ఎదురుకాబోతున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శాసనసభలో ప్రస్తుతం ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ నుంచి ఇటు అధికార పక్షం, అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవలసి రావడం నరేంద్ర మోదీ మహిమే అని చెప్పుకోవలసి ఉంటుంది. మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలిసిందే! శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు చేతులు మారాయి. ఆ పార్టీల అధినేతలైన ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ తమ పార్టీలకు వేరే పేర్లు పెట్టుకున్నారు. మోదీ మార్కు రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!
ఆర్కే
Updated Date - Feb 25 , 2024 | 08:02 AM