Social Media: యువత కోసం కొత్త డిగ్రీ తెచ్చిన ఐర్లాండ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Oct 23 , 2024 | 07:34 AM
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువత సోషల్ మీడియాలో వీడియోలు చేయడాన్నే ఉద్యోగంగా భావిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. తమ అభిరుచికి తగిన ఉద్యోగాలు దొరకకపోవడం, దొరికిన కొలువుల్లో తీవ్రమైన ఒత్తిడి ఉండడంతో కొంతమంది యువత సోషల్ మీడియా వైపు మెుగ్గు చూపుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్‌ఫామ్‌లలో సరదాగా వీడియోలు చేయడం మెుదలుపెట్టి తర్వాత అందులో మెలకువలు తెలుసుకుని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా 2000సంవత్సర తర్వాత పుట్టిన యువకులు ఎక్కువగా దీని వైపే మెుగ్గు చూపుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ఎన్నో రెట్లు అధికంగా సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. వారి ఆదాయం చూస్తుంటే కళ్లు చెదిరిపోవాల్సిందే.
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు. ఒకవేళ ఎంతో కష్టపడి డిగ్రీలు, పీజీలు పాస్ అయినా కేవలం వేలల్లో మాత్రమే జీతాలు వస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మరీ తక్కువగా వేతనాలు ఉంటున్నాయి. అనుభవం మీద మరో కంపెనీకి మారినా తీవ్రమైన పని భారం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఫాలోయింగ్ పెంచుకుని డబ్బు సంపాదించేందుకు మెుగ్గు చూపుతున్నారు. ఇది గమనించిన ఐర్లాండ్ దేశం అలాంటి వారి కోసం కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్లియేటర్ల కోసం ఐర్లాండ్ కార్లోలోని సౌత్ ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ప్రత్యేకమైన కోర్సు ప్రారంభించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని లక్షలు సంపాదించాలనుకునే యువతకు ఉపయోగపడేలా "కంటెంట్ క్రియేషన్ అండ్ సోషల్ మీడియా" అనే నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని అందిస్తోంది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎలా ఫాలోవర్స్‌ను పెంచుకోవాలి, వాటిని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకోవాలి, ఎలాంటి వీడియోల ద్వారా డబ్బులు త్వరగా సంపాదించగలం అనే వివిధ అంశాలను కోర్సులో పొందుపరిచినట్లు కోర్సు డైరెక్టర్ ఐరీన్ మెక్ కార్మిక్ తెలిపారు. నాలుగేళ్లు ఈ డిగ్రీలో సోషల్ మీడియాపై పట్టుసాధించేందుకు పలు అంశాలపై శిక్షణ ఇస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనిలో చేరేందుకు 350 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదే అధికారికంగా గుర్తింపు రావడంతో 15మందితో మెుదటి బ్యాచ్ ప్రారంభమైందని మెక్ కార్మిక్ తెలిపారు.
అయితే ఆడియన్స్‌ను కనెక్ట్ అయ్యేలా ఈ కోర్సులో శిక్షణ ఉంటుందని మెక్ కార్మిక్ తెలిపారు. కెమెరా ముందు ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్లకు అలాగే తెరవెనక ఉండే వారికీ వివిధ అంశాలపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చాలా మంది చిల్లర వేషాలు వేస్తూ పలువురిని ఇబ్బందులకు గురి చేస్తారని, కానీ ఈ డిగ్రీలో హుందాగా వ్యవరిస్తూనే తద్వారా ఉపాధి పొందడంపై అవగాహన కల్పిస్తామని ఆమె వెల్లడించారు. ఈ నాలుగేళ్ల కోర్సులో ఆకట్టుకునేలా వీడియో చేయడం, స్టోరీ టెల్లింగ్ సైకాలజీ, స్టోరీ టెల్లింగ్ సైకాలజీ, డేటా అనలిటిక్స్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, సెలబ్రిటీ స్టడీస్, పోడ్‌కాస్టింగ్ వంటి సబ్జెక్టులు ఉన్నాయన్నారు. అలాగే పెద్దపెద్ద బ్రాండ్లతో ఎలా డీల్స్ చేసుకోవాలని, ప్రమోషన్లు ఎలా చేయాలనే అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నట్లు మెక్ కార్మిక్ తెలిపారు.
Updated Date - Oct 23 , 2024 | 07:34 AM