Loksabha Elections: తెలంగాణలో ఓటర్లలో తగ్గిన చైతన్యం..!!
ABN, Publish Date - May 15 , 2024 | 02:58 AM
లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం పూర్తయిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 65.67 శాతంగా
శాసనసభ ఎన్నికలతో పోలిస్తే
8.56 శాతం తగ్గిన పోలింగ్
నాడు ఉత్సాహంగా ఎన్నికల పండగ..
నేడు నామమాత్రంగా ఇంటింటి ప్రచారం
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం పూర్తయిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 65.67 శాతంగా నమోదు కాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి ఇది 66.30 శాతానికి చేరుకుంది. కాగా, ఆరు నెలల కిందట జరిగిన శాసనభ ఎన్నికల్లో 74.86ు పోలింగ్ నమోదైంది. దీంతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ పోలింగ్ 8.56ు తగ్గింది. ఈ పరిస్థితి నియోజకవర్గాల వారీగా కూడా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 80 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. తాజాగా లోక్‌సభకు వచ్చేసరికి భారీగా తగ్గిపోయింది. రాజధాని నగరంలోనూ భారీగా తేడా కనిపించింది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తక్కువగా, లోక్‌సభకు మరింత తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతూ వస్తోంది. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూలులో తేడా వచ్చింది. 2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా, తాజాగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం.. లోక్‌సభ ఎన్నికల్లో కనిపించలేదు. పార్టీలు సభలు, సమావేశాలు, కూడలి సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించినా.. ఇంటింటి ప్రచా రం చాలా తక్కువగా జరిగింది. ఎమ్మెల్యేలు నామమాత్రంగానే ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వచ్చి పోల్ చీటీలు పంచలేదు. ఎండ తీవ్రత, వేసవి సెలవుల కారణంగా ప్రజలు కూడా పెద్దఎత్తున విహారయాత్రలకు వెళ్లిపోయారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కారణంగానూ పలువురు అక్కడికి వెళ్లారు. అందుకే హైదరాబాద్ నగరంలో పోలింగ్ అంతంతమాత్రంగానే ఉంది.
2019తో పోలిస్తే మెరుగు
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 62.77ు పోలింగ్ నమోదైంది. దీంతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో 3.53ు పోలింగ్ పెరిగింది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, భువనగిరి, ఖమ్మం స్థానాల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. నల్లగొండలో తగ్గింది.
Updated Date - May 15 , 2024 | 07:49 AM