Green Tea: మీకు ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే గ్రీన్ టీ అస్సలు తాగొద్దు..
ABN, Publish Date - Sep 21 , 2024 | 07:26 AM
గ్రీన్ టీలో అద్భుత గుణాలు ఉండడం వల్ల దాన్ని తాగేందుకు ఆరోగ్య ప్రియులు ఇష్టపడుతుంటారు. అయితే గ్రీన్ టీ ఎక్కువ మెుతాదులో సేవించడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తుంటారు. మంచి ఆహారం, వ్యాయామం చేస్తూ పుష్టిగా ఉండాలని అంటుంటారు. అందుకే చాలా మంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీలో అద్భుత గుణాలు ఉండడం వల్ల దాన్ని తాగేందుకు ఆరోగ్య ప్రియులు ఇష్టపడుతుంటారు. అయితే గ్రీన్ టీ ఎక్కువ మెుతాదులో సేవించడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకే దాన్ని తాగాలని చెప్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం ఉన్నవారు అతిగా తాగొద్దు..
ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ సమస్య వేధిస్తోంది. అయితే అధిక బరువు నుంచి బయటపడేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. దీన్ని సేవించడం ద్వారా త్వరగా బరువు తగ్గుతామని వారు భావిస్తారు. అందుకు ఈ పానీయాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఇలాంటి వారు రోజుకు రెండుకు మించి ఎక్కువ కప్పులు తాగితే అనర్థమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బరువు నిదానంగా తగ్గేందుకు ప్రయత్నించాలని, గ్రీన్ టీ అతిగా తాగితే కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
కాలేయ సమస్యలు తలెత్తే ప్రమాదం..
గ్రీన్ టీలో అద్భుత గుణాల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, చక్కెర వ్యాధి అదుపులో ఉంటుందని చాలా మంది భావిస్తారు. అలాగే శరీరంలోని చెడు కొవ్వును ఇది తగ్గిస్తుందని నమ్ముతుంటారు. దీన్ని వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తాగితే మాత్రం ప్రమాదమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ విపరీతంగా సేవిస్తే లివర్ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ ముఖ్యంగా ఎపిగల్లో కాటెచిన్ గాలెట్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందే కాలేయ సమస్యలు ఉన్నవారు అస్సలు ఏమాత్రం ఈ పానీయాన్ని సేవించడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇలాంటి వారు పొరపాటున కూడా తాగొద్దని హెచ్చరిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధుపడుతున్న వారు సైతం డాక్టర్లను సంప్రదించిన తర్వాతే తాగాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యం కోసం చాలా మంది ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతారు. అలాగే వ్యాయామాలూ చేస్తుంటారు. అయితే ఏది చేసినా మితంగానే చేయాలని నిపుణులు చెప్తున్నారు. లేకుంటే ఆరోగ్యానికి బదులు అనారోగ్య సమస్యలు తలెత్తి మెుత్తానికే తేడా కొట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
For more Telugu news and Health news click here..
Updated Date - Sep 21 , 2024 | 07:28 AM