కేజ్రీవాల్‌కు లభించని ఊరట
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:39 AM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 29వ తేదీ తర్వాత
ఈడీ అరెస్టుపై ఆయన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 29వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే వారంలో ఆయన పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ ప్రతిస్పందన కోరుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా సోమవారం నోటీసులు జారీ చేశా రు. వీటికి ఈనెల 24లోపు జవాబివ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. న్యాయస్థానం దిగ్భ్రమకు గురయ్యే కొన్ని వాస్తవాలను వెల్లడించాలనుకుంటున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేకుండాపోయిందంటూ సింఘ్వీ చేసిన వాదనలను సుప్రీం విస్మరించింది. కాగా.. సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదని తెలిసిన కొద్దిసేపటికే రౌజ్ అవెన్యూలోని ఈడీ ప్రత్యేక కోర్టు కూడా ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23వరకు పొడిగించింది. దాంతో తిహాడ్ జైలులో కేజ్రీవాల్ కనీసం మరో రెండు వారాలు గడపక తప్పదని తెలుస్తోంది.
కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా చూస్తున్నారు: మాన్
కేజ్రీవాల్‌ను జైల్లో ఉగ్రవాదిగా చూస్తున్నారని, కరడుగట్టిన నేరగాళ్లకు ఇచ్చే సౌకర్యాలుకూడా కల్పించడంలేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. సోమవారం ఆయన తిహాడ్ జైల్లో కేజ్రీవాల్‌ను కలిశారు. అద్దాల గోడకు అటూ ఇటూ కూర్చు ని దాదాపు అరగంటసేపు ఫోన్ లైన్ ద్వారా మాట్లాడుకున్నారు. కాగా కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వ పాలనను నిర్వహించనున్నారు. వచ్చే వారం నుంచి జైల్లోనే రోజుకు ఇద్దరు మంత్రుల చొప్పున కలుసుకుని, ఆయావిభాగాల్లో పురోగతిని పరీక్షించనున్నారు.