Crime News: యువకుడిపైకి వేగంగా వచ్చిన కారు.. చివరికి.. జరిగింది ఇదే..
ABN, Publish Date - Nov 03 , 2024 | 08:27 PM
దీపావళి రోజు రాత్రి సమయంలో చాలా మంది యువకులు పుణె రోడ్లపై చేరి టపాసులు కాలుస్తున్నారు. సోహామ్ పటేల్ (35) అనే వ్యక్తి సైతం వారితో చేరి సంతోషంగా వేడుక చేసుకుంటున్నాడు. టపాసులకు నిప్పంటించే క్రమంలో సోహామ్ పటేల్ కొంచెం రోడ్డుపైకి వెళ్లాడు.
మహారాష్ట్ర: పూణెలో దీపావళి రోజున విషాద సంఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డుపై టపాసులు కాలుస్తున్న యువకుడిపైకి అతివేగంగా దూసుకొచ్చిన కారు అతని ప్రాణాలు తీసింది. పండగ వేళ ఈ ఘటన యువకుడి కుటుంబంలో విషాదం నింపింది. అయితే ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీపావళి రోజు రాత్రి సమయంలో చాలా మంది యువకులు పుణె రోడ్లపై చేరి టపాసులు కాలుస్తున్నారు. సోహామ్ పటేల్ (35) అనే వ్యక్తి సైతం వారితో చేరి సంతోషంగా వేడుక చేసుకుంటున్నాడు. టపాసులకు నిప్పంటించే క్రమంలో సోహామ్ పటేల్ కొంచెం రోడ్డుపైకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అతి వేగంగా వచ్చిన కారు అతనిపైకి దూసుకెళ్లింది. బలంగా ఢీకొట్టడంతో యువకుడు ఎగిరి దూరంగా పడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న పటేల్ స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనానికి సంబంధించిన సమాచారం సేకరించేందుకు చర్యలు చేపట్టారు. అయితే 48గంటలు గడిచినా ఇంత వరకూ నిందితుడి సమాచారం దొరకలేదు. కారు ఎవరిది, ఎవరు నడిపారు వంటి కనీస సమాచారం సైతం సేకరించలేకపోయారు. పండగ వేళ కుమారుడు మృతిచెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంతవరకూ పోలీసులు నిందితుల వివరాలు సేకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో దీపావళి నాడు పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పూణే సిన్హ్‌గడ్ ప్రాంతంలో ఐదుగురు చిన్నారులు బాణాసంచా పేల్చడంతో డ్రైనేజీ ఛాంబర్ మూత పేలి వారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఉత్తర నాగ్‌పూర్‌లోని జై భీమ్ చౌక్ సమీపంలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో అబూ హంజా జలవుద్దీన్ షేక్‌ను మాజిద్ అలీ ఖాదర్, అతని సహచరుడు గోలు తౌసీఫ్ కత్తితో పొడిచి హత్య చేశారు. అలాగే కాటన్ మార్కెట్ స్క్వేర్ సమీపంలో జరిగిన మరో సంఘటనలో రూప్‌చంద్ మాదవి అనే బిచ్చగాడిని మరో బిచ్చగాడు కత్తితో పొడిచాడు. అక్టోబరు 11న సైతం పూణెలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. విలాసవంతమైన కారులో వచ్చిన ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్ అయిన అక్బర్ షేక్ అనే ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా దీపావళి పండగ నాడు పలు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Updated Date - Nov 03 , 2024 | 08:27 PM