Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం
ABN, Publish Date - Sep 13 , 2024 | 01:30 PM
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఓ వైపు గణపతి నవరాత్రుల కోలాహలం.. మరోవైపు ఆరు నెలల అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో దాదాపుగా పండగ వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాల్లో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరింది. దీంతో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మిఠాయిలు సైతం ఒకరినొకరు తినిపించుకున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న వార్త తెలియగానే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, విద్యా శాఖ మంత్రి అతిషిలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సత్యమేవ జయతే అంటూ ఎక్స్ వేదికగా స్పందించింది. హిరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్దమవుతామని స్పష్టం చేసింది. అలాగే కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల కావడంపై ఆప్ పార్టీలోని అగ్రనేతలు సైతం ఎక్స్ వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా.. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పార్టీ రాజ్యసభ మరో సభ్యుడు హరిభజన్ సింగ్ సైతం.. ప్రజలకు సేవ చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంకితమవుతారన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 21న సీఎం కేజీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. బెయిల్ కోసం పలుమార్లు ఆయన కోర్టులను ఆశ్రయించినా ఊరట మాత్రం లభించలేదు. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆయనకు నిర్ణీత గడువుతో బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ తేదీ జూన్ 2వ తేదీతో ముగియడంతో.. అదే రోజు ఆయన తిరిగి తీహాడ్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. అనంతరం మళ్లీ ఆయన వివిధ సందర్బాల్లో బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బెయిల్ లభించలేదు.
తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 లక్షల పూచికత్తు సమర్పించి.. ఇద్దరి ష్యూరిటీ సంతకాలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 13 , 2024 | 01:30 PM