LK Advani: రామమందిరం ప్రతిష్ఠాపనకు అద్వానీ వస్తున్నారు: వీహెచ్‌పీ నేత
ABN , Publish Date - Jan 10 , 2024 | 08:14 PM
అయోధ్యలో రామమందిరం కోసం జరిపిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అడ్వాణి ఈనెల 21న జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. తప్పనిసరిగా ఆయన హాజరవుతారని, అయితే వయోభారం దృష్ట్యా కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఆయన ఉండకపోవచ్చని చెప్పారు.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం కోసం జరిపిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అడ్వాణి (Lal Krishna Advani) ఈనెల 21న జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ (VHP) వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ (Alok Kumar) తెలిపారు. తప్పనిసరిగా ఆయన హాజరవుతారని, అయితే వయోభారం దృష్ట్యా కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఆయన ఉండలేకపోవచ్చని చెప్పారు.
''ఎల్‌కే అడ్వాణిని ఆహ్వానించేందుకు మేము వెళ్లినప్పుడు ప్రయాణ ఏర్పాట్లు గురించి, తనను ఆలయంలోకి ఎలా తీసుకువెళ్తారనే విషయాలను ఆయన అడిగారు. అయోధ్యకు రాలేననే ఆలోచన మాత్రం ఆయనలో ఎంతమాత్రం కనిపించలేదు'' అని అలోక్ కుమార్ తెలిపారు. మరోవైపు, అడ్వాణి అయోధ్యకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ఎంపీ, రామాలయ ఉద్యమంలో పాల్గొన్న రామ్ విలాస్ వేదాంతి ఇటీవల కోరారు. అడ్వానీ స్వయంగా తన కళ్లతో రామ్ లల్లా ప్రతిష్ఠాపన చూడాలని, ఇది దేశ ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి కోరకని వేదాంతి చెప్పారు. రామాలయ నిర్మాణానికి అడ్వాణి చేసిన కృషి అసామాన్యమని కొనియాడారు. అయోధ్యలో రామాలయం ఈ దశకు చేరుకోవడానికి అటల్ (వాజ్‌పేయి), అడ్వాణి, జోషి చాలా చేశారని గుర్తుచేసుకున్నారు.