Share News

వాషింగ్ మెషిన్‌లా మారిన బీజేపీ.. మోదీపై మల్లికార్జున్ ఖర్గే

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:26 PM

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వాషింగ్ మెషిన్‌లా మారిన బీజేపీ.. మోదీపై మల్లికార్జున్ ఖర్గే
MalliKharhuna Kharge

న్యూఢిల్లీ, ఏప్రిల్ 05: కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో (congress party manifesto) ను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (mallikarjun kharge) స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ (babu jagjivan ram) జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాబూ జగజ్జీవన్ రామ్ దేశానికి, పార్టీకి చేసిన సేవలను ఈ సందర్బంగా ఆయన కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రలో 5 పిల్లర్లపై దృష్టి పెట్టామని చెప్పారు. అవి యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక న్యాయ్. నారీ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అని ఆయన వివరించారు. వాటి ఆధారంగా 25 గ్యారంటీలు పొందుపరిచామన్నారు. యువ న్యాయ్‌లో భాగంగా అప్రెంటిస్‌షిప్ తప్పనిసరి చేస్తామన్నారు. అప్రెంటిస్ చేసేవారికి ఏడాదికి కనీసం రూ.1 లక్ష లభించేలా పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఇక పేద మహిళకు ఏడాదికి రూ.1 లక్ష మద్దతుగా అందిస్తామన్నారు.


ఇక కిసాన్ న్యాయ్‌లో భాగంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. శ్రామిక్ న్యాయ్‌లో భాగంగా రూ.400 కనీస కూలీ నిర్ణయిస్తామని చెప్పారు. హిస్సేదారీ న్యాయ్‌లో భాగంగా కులాల వారిగా జన గణన చేస్తామని.. అయితే ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంత వాటా దక్కేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

కులగణన ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగా జరిగేది కాదన్నారు. అన్ని వర్గాల్లోని పేదలకు న్యాయం అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక ఆర్థిక న్యాయ్‌లో భాగంగా ఆర్థిక న్యాయం, నిరుద్యోగం, పన్నుల సంస్కరణలు ఉన్నాయన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతులు సైతం పెంపొందిస్తామని చెప్పారు. రాజ్య న్యాయ్‌లో భాగంగా రాష్ట్రాలకు న్యాయం చేస్తాం... అందులోభాగంగా ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు.


రాష్ట్రాలు ఎదుర్కొనే ప్రకృతి వైపరీత్యాల్లో చట్ట ప్రకారం కేంద్రం అందించే మద్దతు అందేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని రక్షా న్యాయ్ ఏర్పాటు చేశామని... అందులో విదేశీ విధానం కూడా ఉందన్నారు. మన విదేశీ విధానం ఇన్నాళ్లుగా విజయవంతమైందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. పర్యావరణ్ న్యాయ్ అంశాన్ని కూడా అందులో పొందుపరిచామని... అయితే దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.

భారతదేశానికి సరికొత్త దశా దిశా నిర్దేశించేలా ఈ మేనిఫెస్టో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భూమి మీదే నడుస్తుంది తప్పా.. ఆకాశానికి నిచ్చెన వేయలేదన్నారు.. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందన్నారు. సాధ్యం కానీ లక్ష్యాలు నిర్దేశించుకోలేదని.. అలాగే మేము మోసపూరితంగా వ్యవహరించ లేదన్నారు. అయితే చేయగల్గిందే చెప్పామని.. చెప్పిందే చేసి చూపించామని.. ప్రస్తుతం చేయగల్గిందే మేము ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. అందుకోసం ఆయా రంగాల నిపుణులతో సైతం చర్చించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వంచిత వర్గాలు, పీడిత, పేద, మహిళ, యువ వర్గాలకు అందకుండా పోయిన న్యాయాన్ని అందిస్తామని పదేళ్ల కాలంలో పేదలకు అందకుండా పోయిన ఫలాలు సైతం అందిస్తామని ఇదే తమ హామీ అని ఆయన స్పష్టం చేశారు.


గత యూపీఏ హయాంలో పదేళ్లలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. పనికి ఆహార పథకం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి వాటిలో కొన్నిమచ్చుతునకలని.. అయితే వాటిని అమలు చేసే వరకు సోనియా గాంధీ గట్టి పట్టుదలతో పని చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ మోదీ పదేళ్ల పాలనలో పేదల కోసం ఒక్క పని కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నెహ్రూ హయాంలో ఏర్పాటైనట్టు మోదీ హయాంలో పెద్ద పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు అయ్యాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక శాస్త్ర, విజ్ఞాన ఆవిష్కరణలు జరిగాయన్నారు. ఈ మోదీ హయాంలో గత ప్రభుత్వాలను తిట్టిపోయడం తప్ప చేసిందేమీ లేదని చెప్పారు.

మేము ఇవ్వబోతున్న హామీలను మేము అమలు చేసి చూపించామన్నారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలు చేసే చూపించినవే తాము ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై మోదీ అనుసరించిన దుష్టనీతి గురించి ఈ సందర్బంగా మీకు వివరించాలన్నారు. మా పార్టీకి రూ.3వేల కోట్లకు పైగా ట్యాక్స్ పెనాల్టీ విధించారని గుర్తు చేశారు. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుందా? ఇది ప్రజాస్వామ్య విధానమా? అని ఆయన ప్రశ్నించారు.


మోదీ అంటే నిరంకుశం.. నియంతృత్వమని అభివర్ణించారు. వాటిని వదిలించుకోవాలంటే మోదీని గద్దె దించాలన్నారు. . కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఈ గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లినప్పుడే మార్పు అనేది సాధ్యమవుతుందని అబిప్రాయపడ్డారు. లేదంటే మనం ఆశించే మార్పు సాధ్యం కాదన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అర్థమయ్యేలా చెప్పినప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. అయితే చందా తీసుకురా.. కాంట్రాక్ట్ తీసుకో అన్నదే బీజేపీ విధానమని.. అవినీతి రూపుమాపామని గొంతు చించుకుని మాట్లాడతారని బీజేపీ నేతలపై మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.

ఆ పార్టీ వాషింగ్ మెషీన్‌లా మారిందని అభివర్ణించారు. ఆ పార్టీలో చేరగానే ఎన్ని కేసులున్నా సరే క్లీన్ అయిపోతారని ఎద్దేవా చేశారు. టు దర్యాప్తు సంస్థలతో బెదిరించి, అటు దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారంటూ బీజేపీ నేతలలపై మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్నీ జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Congress Manifesto Live Updates: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై వరాల జల్లు..

Chennai: 9న పాండీబజార్‌లో 2 కి.మీ.ల వరకు మోదీ రోడ్‌షో

Updated Date - Apr 05 , 2024 | 04:25 PM