Arvind Kejriwal: త్వరలోనే అతిషిని అరెస్టు చేస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:09 PM
సీబీఐ, ఈడీ, ఐ-టీ ఏజెన్సీల మధ్య ఇటీవల సమావేశం జరిగిందని, తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేయాలనుకుంటున్నట్టు మాట్లాడుకున్నారని, ఆ సమాాచారం తన వద్ద ఉందని కేజ్రీవాల్ చెప్పారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తప్పుడు కేసులో ముఖ్యమంత్రి అతిషి (Atishi)ని కేంద్ర ఏజెన్సీలు త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు వ్యాఖ్యానించారు. అతిషితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, సీబీఐ, ఈడీ, ఐ-టీ ఏజెన్సీల మధ్య ఇటీవల సమావేశం జరిగిందని, తప్పుడు కేసులో సీఎంను అరెస్టు చేయాలనుకుంటున్నట్టు మాట్లాడుకున్నారని, ఆ సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. సీఎం అరెస్టుకు ముందే తన నివాసంలోనూ సౌరభ్ భరద్వాజ్ ఇతర ఆప్ నేతల ఇళ్లలోనూ కేంద్ర ఏజెన్సీలు సోదాలు నిర్వహిస్తాయని అన్నారు.
''గత పదేళ్లలో ఢిల్లీకి బీజేపీ చేసిందేమీ లేదు. కేజ్రీవాల్‌ను నిదించడమే పనిగా పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పనుల ఆధారంగానే ప్రచారం సాగిస్తోంది'' అని మాజీ సీఎం చెప్పారు. ఆప్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల వైద్య సాయం కోసం 'మహిళా సమ్మాన్ యోజన' సహా పలు పథకాలను ఆప్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. వీటి కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం బీజేపీకి నచ్చడం లేదన్నారు. ఢిల్లీ క్యాబినెట్ ఇప్పుటికే రూ.1,000 అలవెన్స్‌ను ఆమోదించిందని, నోటీఫికేషన్ కూడా జారీ చేసిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల పథకాన్ని తాను బతికుండగా ఆగిపోనీయనని చెప్పారు.
అరెస్టు చేసినా...
కాగా, ఢిల్లీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను నిలిపివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే విశ్వసనీయ సమావేశం కేజ్రీవాల్ వద్ద ఉందని అతిషి తెలిపారు. ''వాళ్లు నన్ను అరెస్టు చేసినా న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై నాకు నమ్మకం ఉంది. తప్పుడు ఆరోపణలు చేసినా తప్పనిసరిగా బెయిల్ వస్తుందనే నమ్మకం ఉంది" అని సీఎం అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్నాయి.
Updated Date - Dec 25 , 2024 | 03:09 PM