ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paper Leakage : అడ్డుకట్టే పెద్ద ‘ప్రశ్న’!!

ABN, Publish Date - Jun 23 , 2024 | 03:59 AM

అటు నియామక పరీక్ష కానీ.. ఇటు బోర్డు పరీక్ష కానీ..! నెట్‌ వంటి ప్రామాణిక పరీక్ష కానీ..! నీట్‌ వంటి కీలకమైన పరీక్ష కానీ..! రాజస్థాన్‌ నుంచి తమిళనాడు వరకు..

  • ఏడేళ్లలో 70 పైగా పేపర్ల లీక్‌.. 1.70 కోట్ల మందిపై ప్రభావం

  • దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో ఘటనలు.. అధికారులు, టీచర్ల పాత్ర

  • ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి కూడా.. సోషల్‌ మీడియా కూడా ఓ వాహకమే

  • లీకు తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం.. తాజా చట్టమూ ఇలానే..!

టు నియామక పరీక్ష కానీ.. ఇటు బోర్డు పరీక్ష కానీ..! నెట్‌ వంటి ప్రామాణిక పరీక్ష కానీ..! నీట్‌ వంటి కీలకమైన పరీక్ష కానీ..! రాజస్థాన్‌ నుంచి తమిళనాడు వరకు.. గుజరాత్‌ నుంచి బెంగాల్‌ దాక.. దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీ అనేది ఇటీవల సర్వసాధారణమైపోయింది. ఔత్సాహిక అభ్యర్థులు, ప్రతిభావంతులైన విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారింది. ఇలాంటివారిలో కొందరు.. తాము పడిన కష్టం వృథా అయిందనే వేదనతో బలవన్మరణాలకూ పాల్పడ్డారు. పరీక్షల వ్యవస్థను భూతంలా పట్టి పీడిస్తున్న లీకేజీ విష సంస్కృతి తాజాగా నీట్‌, నెట్‌ ఉదంతాల నేపథ్యంలో మళ్లీ పెను దుమారం రేపుతోంది.

లీక్‌ మాఫియా.. ఏటా పదిపైనే..

నీట్‌, నెట్‌లో అవకతవలు ఒకేసారి బయటపడడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. కానీ, ఏడేళ్లుగా కనీసం ఏదో ఒక రాష్ట్రంలో పేపర్‌ లీకేజీ అనేది సర్వసాధారణమైంది. 2017 నుంచి చూస్తే 15 రాష్ట్రాల్లో 70 పైగా లీకేజీ ఘటనలు జరిగాయి. 1.70 కోట్లమంది అభ్యర్థులు ప్రభావితం అయ్యారు. ఇవన్నీ దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి.

పోలీసులు, దర్యాప్తు సంస్థల విచారణలో తేలిన విస్మయకర విషయం ఏమంటే.. పేపర్‌ లీకేజీలో ప్రభుత్వ అఽధికారులు, ఉపాధ్యాయుల పాత్ర ఉండడం. 24 లక్షలమంది పైగా హాజరైన ఇటీవలి నీట్‌ ప్రశ్నపత్రం బయటకు రావడాన్ని బటి చూస్తే దేశంలో ‘పేపర్‌ లీక్‌ మాఫియా’ ఎలా వేళ్లూనుకుందో స్పష్టమతోందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.


లీకేజీలను ఎన్నికల సందర్భంగా గట్టిగా లేవనెత్తే రాజకీయ పార్టీలు తర్వాత నోరు మెదపడం లేదు. ఇది నాయకులు, లీకేజీ మాఫియా కలిసిపోయాయా? అనే అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. ప్రశ్నపత్రం సత్వరమే వేలాది చేతులు మారడంలో సోషల్‌ మీడియా ప్రధాన వాహకంగా మారుతోంది. పేపర్‌ లీక్‌ అయిన సందర్భాల్లో మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం, సమయమంతా వృథా కావడంతో విద్యార్థుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. కాగా, చాలా సందర్భాల్లో పేపర్‌ లీకేజీ చాన్నాళ్ల తర్వాత బయట పడుతోంది. ఈలోగా అనుచిత లబ్ధి పొందిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. బిహార్‌, యూపీల్లో ‘ఉద్యోగానికి భూమి’ కుంభకోణం ఇదే తరహాలోనిదే. కాగా, బిహార్‌ తాజాగా కేంద్రం తీసుకొచ్చిన చట్టం నుంచి తప్పుకోవడం గమనార్హం.

- సెంట్రల్‌ డెస్క్‌


ఈ రాష్ట్రాల్లోనే అధికం

తెలంగాణ, రాజస్థాన్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌.. దేశంలో పేపర్‌ లీకులు అత్యధికంగా జరిగిన రాష్ట్రాలు. వీటిలో ముఖ్యమైన ఉద్యోగ నియామక పరీక్షలే కాదు.. ఉన్నత విద్య, పాఠశాల పరీక్షల ప్రశ్నపత్రాలు ముందే బయటకు రావడం గమనార్హం. బిహార్‌లో పదో తరగతి పేపర్‌ ఆరుసార్లు, బెంగాల్‌ రాష్ట్ర బోర్డు ఎగ్జామ్‌ పేపర్‌ పదిసార్లు లీకయ్యాయి.

రెండేళ్ల కిందట తమిళనాడులో 10, 12 తరగతుల పేపర్లు రెండూ పరీక్షకు ముందే విద్యార్థుల చేతుల్లో ఉన్నాయి. ఇక రాజస్థాన్‌ది మరో రికార్డు. యూజీసీ నెట్‌ సహా 2015-23 మధ్య 14 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. గుజరాత్‌లోనూ ఏడేళ్లలో 14 లీకేజీ ఉదంతాలు జరిగాయి. యూపీలో టెట్‌, నీట్‌ యూజీ (2021), ఇంటర్‌ సహా 9 ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో పరాకాష్ఠ.. ఈ ఏడాది 48 లక్షల మంది అభ్యర్థులు హాజరైన కానిస్టేబుల్‌ నియామక పరీక్ష పేపర్‌ లీకేజీ. కాగా, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లోనూ పేపర్‌ లీకేజీ ఆరోపణలు వచ్చాయి.


పదేళ్ల జైలు.. కోటి జరిమానా

పేపర్‌ లీకేజీ కారకులపై చర్యలు తీసుకునేందుకు కఠినమైన ‘‘ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం-2024’’ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. గత ఫిబ్రవరిలోనే ఈ చట్టాన్ని రూపొందించినా.. ఎన్నికల నేపథ్యంలో ప్రకటించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ‘ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌’ను శుక్రవారం (జూన్‌ 21) నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం గెజిట్‌ ఇచ్చింది. దీనిప్రకారం.. వ్యక్తులు కానీ, పరీక్షల నిర్వహణ సంస్థ కానీ వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే ఐదేళ్ల జైలు (పదేళ్ల వరకు పొడిగించొచ్చు), కనీసం రూ.కోటి జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడుతూ దొరికినవారికి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఏదైనా పరీక్ష నిర్వహణ సంస్థ గనుక అవకతవకలు చేస్తే రూ.కోటి దాకా జరిమానా వేసి, పరీక్షల ఖర్చులనూ వారి నుంచే వసూలు చేస్తారు.


కేంద్ర పరిధిలోని పరీక్షలకేనా?

కొత్త చట్టం లీకేజీకి అడ్డుకట్ట వేసేలా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఎలాగనేది ఇందులో లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యం పెంచుతూ, కృత్రిమ మేధ వంటి సాంకేతికతను వాడుకుంటూ లీకేజీలను నిరోధించాలని సూచిస్తున్నారు. కాగా, ఈ చట్టాన్ని కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షలకే పరిమితం చేయడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 23 , 2024 | 03:59 AM

Advertising
Advertising