Rahul Gandhi: ఇక పొత్తు కుదిరినట్టే.. ఎట్టకేలకు రాహుల్ న్యాయ యాత్రలో అఖిలేశ్ యాదవ్..
ABN, Publish Date - Feb 25 , 2024 | 06:30 PM
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆగ్రాలో అఖిలేష్ యాదవ్ ఈ యాత్రలో చేరారు. ఈ మేరకు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాల్ అని రాహుల్ అన్నారు. 'బీజేపీ హాటావో, దేశ్ బచావో" అని అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎలక్షన్ల కోసం కాంగ్రెస్, ఎస్పీల మధ్య సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను ఎస్పీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుంది.
ఈ రోజు తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అలీగఢ్‌లో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర అలీఘర్ డివిజన్ నుంచి అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్ మీదుగా సాగి ఆగ్రా డివిజన్‌లోకి ప్రవేశించింది. దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయంటూ బీజేపీపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో పేదలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.
రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఏడేళ్ల క్రితం ఆగ్రాలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - 2017 సందర్భంగా 12 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. కాగా.. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగుతున్న అలీగఢ్, హత్రాస్ (రిజర్వ్‌డ్), ఆగ్రా (రిజర్వ్‌డ్), ఫతేపూర్ సిక్రీలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోవడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2024 | 06:47 PM