Central Govt : బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు!
ABN, Publish Date - Sep 10 , 2024 | 04:10 AM
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
జీఎస్టీ మండలిలో విస్తృత ఏకాభిప్రాయం
నవంబరు భేటీలో తగ్గింపుపై నిర్ణయం
క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
చిరుతిళ్లపై 18 నుంచి 12 శాతానికి..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీన్ని తగ్గించే విషయమై జీఎస్టీ మండలి విస్తృత ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం ఆమె నేతృత్వంలో జీఎస్టీ మండలి 54వ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. బీమా ప్రీమియంలపై ఎంత మేరకు పన్ను తగ్గించాలనే అంశంపై నవంబరులో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని తగ్గిస్తే కలిగే ప్రభావాలపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ సమగ్ర నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది.
బీమా ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నిర్మల తెలిపారు. దీనిపై వచ్చే నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత నవంబరులో జరిగే మండలి భేటీలో బీమా ప్రీమియంపై ఎంత మేరకు జీఎస్టీ తగ్గించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక తాజా సమావేశంలో క్యాన్సర్ ఔషధాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మతపరమైన ప్రయాణాల్లో ఉపయోగించే హెలికాప్టర్ సర్వీసులపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు నిర్మల వెల్లడించారు. అలాగే చిరుతిళ్ల (స్నాక్స్)పై ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయంచిన తర్వాత (2023, అక్టోబరు 1) నుంచి ఆర్నెల్లలోనే ఈ రంగంలో పన్ను వసూళ్లు 412 శాతం పెరిగి రూ.6909 కోట్లకు చేరాయని నిర్మల వెల్లడించారు. కాగా, బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం తగ్గిపోయి.. కోట్లాది మంది పాలసీదారులకు లబ్ధి చేకూరుతుంది. 2023-24లో కేంద్రం, రాష్ట్రాలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8262.94 కోట్లు వసూలు చేశాయి.
Updated Date - Sep 10 , 2024 | 04:10 AM