CWC: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:26 PM
కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు.. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: జాతిపిత మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వేదికపై ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో కేసీ వేణుగోపాల్ విలేకర్లతో మాట్లాడుతూ.. డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెలగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశాలు బెలగావిలో జరగనున్నాయని తెలిపారు.
ఈ సమావేశాలను నవ్ సత్యాగ్రహ బైఠక్ అని పిలుస్తున్నామని పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు జై బాపు, జై బీమ్, జై సంవిధాన్ పేరిట ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని ఆయన వివరించారు. ఇక 27వ తేదిన మధ్యాహ్నం 2.30 గంటలకు మహాత్మాగాంధీ నగర్‌లో ఈ సీడబ్ల్యుసీ సమావేశానికి 200 మంది శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారని తెలిపారు.
Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్
1924, డిసెంబర్ 26వ తేదీన మహాత్మా గాంధీ నేతృత్వంలో కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వంద ఏళ్ళ అనంతరం అదే స్ఫూర్తితో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్
ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖలతోపాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకొంది. దీంతో భవిష్యత్తులో పార్టీ అనుసరించవలసిన వ్యూహంపై చర్చించనున్నారు. అధికార ఎన్డీయేను ఎలా ఎదుర్కోవాలి... రానున్న ఢిల్లీ అసెంబ్లీలో ఒంటరిగా బరిలో దిగుతోన్న వేళ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై ఈ సందర్భంగా పార్టీ నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజీనామా చేయ్యాలని.. అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాంటి వేళ.. పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు దీనిపై చర్చను ఏర్పాటు చేశారు.
ఆ క్రమంలో అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అన్ని సార్లు దేవుడి పేరు తలిస్తే.. స్వర్గం లోకం సంప్రాప్తిస్తోందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడితోపాటు నిరసనలు సైతం చేపట్టారు.
For National News And Telugu News
Updated Date - Dec 24 , 2024 | 04:28 PM