ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress :ఏం భాష ఇది?

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:12 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది.

  • ఫిర్యాదు చేస్తే మా పార్టీ, నేతల మీద దాడులు చేస్తారా?

  • ఈవీఎంల గురించి అడిగితే.. ఏవేవో సమాధానాలా?

  • తటస్థత అవశేషాలను కూడా వదిలేసుకుంటున్నారా?

  • కమిషనర్‌ అసమ్మతి నోట్‌ను ఎలా తొక్కిపెడతారు?

  • న్యాయపోరాటమే మార్గం.. ఈసీపై కాంగ్రెస్‌ నిప్పులు

  • 9 మంది సీనియర్ల లేఖ.. మళ్లీ ‘హరియాణా’ వివాదం

న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే కక్షిదారుల పిటిషన్లపై తీర్పులను వెలువరించే జడ్జీలు ఆ కక్షిదారులను తిడుతూ, దాడులు చేయరని.. కానీ, ఈసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. ఆధిపత్య ధోరణితో ఈసీ తమకు ఇచ్చిన ప్రతీ జవాబు.. తమ పార్టీని, తమ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లుగా ఉందే తప్ప తాము వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసేలా లేదని తెలిపింది. ‘తటస్థతకు సంబంధించి మిగిలి ఉన్న అవశేషాలేమైనా మిగిలి ఉంటే.. వాటిని కూడా తొలగించుకోవాలన్నదే ఈసీ లక్ష్యమైతే ఆ దిశగా ఈసీ అద్భుతంగా పని చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది’ అని పేర్కొంది. ఈసీ తీరు ఇలాగే ఉంటే తాము న్యాయపోరాటం చేయటానికి వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేందర్‌ హుడా, అజయ్‌ మాకెన్‌, అభిషేక్‌ మను సింఘ్వి, ఉదయ్‌ భాన్‌, ప్రతాప్‌ భజ్వా, పవన్‌ ఖేరా సంయుక్తంగా ఈసీకి లేఖ రాశారు.


  • మేం అడిగిందేమిటి.. మీరు చెప్పిందేమిటి?

హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నాయని, తాము గెలిచిన అన్ని స్థానాల్లో ఈవీఎంల బ్యాటరీలు 60-70 శాతం చార్జింగ్‌తో ఉన్నాయని.. దీనికి కారణమేమిటని కాంగ్రెస్‌ ఈసీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తాజా లేఖలో ప్రస్తావిస్తూ.. ‘ఆ యంత్రం ఎలా పని చేస్తుంది అన్నదానిపైనే మీ సమాధానం ఉందిగానీ.. మేం లేవనెత్తిన ఒక కచ్చితమైన ఫిర్యాదుపైన మీరు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మా ప్రశ్నలన్నింటికీ మీ సమాధానాలు ఇదే తరహాలో ఉన్నాయి. స్పష్టమైన జవాబులివ్వటం కంటే మాపైన, మా ఫిర్యాదులపైన దాడి చేయటం మీదనే మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు’ అని కాంగ్రెస్‌ నేతలు దుయ్యబట్టారు. ‘మీకు మీరు క్లీన్‌చిట్‌ ఇచ్చుకోవటం మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు.

ఎందుకంటే, అలా జరుగుతుందని మాకు తెలుసు. అయితే, మా పార్టీపై మీరు ఉపయోగించిన భాష, మాపై చేసిన ఆరోపణలు మేం మళ్లీ స్పందించాల్సిన అవసరం కల్పించింది. మా ఫిర్యాదులను, మా వాదనలను వినే బాధ్యత మీకుంది. అందుకు మీరు ఇష్టపడకపోతే.. మీ చేత ఆ పని చేయించటం కోసం మేం ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లే అవకాశాన్ని చట్టాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు. తమ మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయపోరాటం మినహా తమకు మరో మార్గం లేదన్నారు. తమకున్న స్వల్ప వనరుల ద్వారా లభించిన సమాచారాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చామని, ఈసీ వద్ద అపారమైన వనరులుంటాయని.. వాటితో, తాము పేర్కొన్న అంశాల్లో వాస్తవం ఉందా? లేదా? అని పరిశీలించవచ్చన్నారు. అనేక సందర్భాల్లో తాము లేవనెత్తిన అంశాలు సరైనవని ఈసీ కూడా గుర్తించిందని తెలిపారు.


  • ఎన్నికల కమిషనర్‌ నోట్‌ను తొక్కిపెడతారా?

ఈసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేసే ఉద్దేశమే తమకు ఉంటే.. ఇటీవలి కాలంలో ఈసీ కీర్తికి భంగం కలిగించిన పలు అంశాలను తాము ప్రస్తావించేవారమని కాంగ్రెస్‌ నేతలు ఈ లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోదీ, అమిత్‌షాల ప్రసంగాలపై తాము వందకుపైగా ఫిర్యాదులు చేస్తే.. కనీసం ఒక్కదానిపై కూడా వారి మీద ఈసీ చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. కానీ, తమ అధ్యక్షుడు ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీల ప్రసంగాలను మాత్రం పలుమార్లు ఈసీ ఆక్షేపించిందన్నారు. ఈ విషయంలో.. స్వయంగా ఎన్నికల సంఘానికి చెందిన ఒక మాజీ కమిషనర్‌ ఇచ్చిన అసమ్మతి నోట్‌ను కూడా బయటికి రాకుండా ఈసీ తొక్కిపట్టిందని వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకతను పెంచటానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఈసీ అడ్డుకుందని, సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతగానీ వీవీపాట్ల సంఖ్య పెంపునకు అంగీకరించలేదని గుర్తు చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 04:12 AM