Share News

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

ABN , Publish Date - Mar 19 , 2024 | 07:50 PM

పశ్చిమబెంగాల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Lok Sabha polls: మమత కోటలో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ (West Bengal) నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


విపక్ష 'ఇండియా' కూటమిలో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ ఇటీవల గండికొట్టింది. ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.


రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థులు

మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ 82 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 8న విడుదల చేసిన తొలి జాబితాలో 39 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో రాహుల్ గాంధీ, డీకే సురేష్, శశిథరూర్ వంటి కీలక నేతలు ఉన్నాయి. మార్చి 12న విడుదల చేసిన రెండో జాబితాలో గౌరవ్ గొగోయ్, నకుల్ నాథ్, వైభవ్ పటేల్ వంటి నేతలు ఉన్నారు.


సీడ్ల్యూసీ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చ

కాగా, మంగళవారంనాడు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు, రాహుల్ గాంధీ, అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, కుమారి సెల్జా తదితరులు హాజరయ్యారు. 'పాంచ్ న్యాయ్' పేరుతో 5 అంశాలతో మేనిఫెస్టోను సీడబ్ల్యూసీ సమావేశంలో ఖరారు చేసినట్టు చెబుతున్నారు. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరుతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 07:50 PM