Mahatma remarks: రాహుల్ కాబోయే మహాత్ముడు, గాంధీజీ 'కన్నింగ్'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్య
ABN, Publish Date - May 03 , 2024 | 08:51 PM
రాహుల్ గాంధీని 'భావి మహాత్ముడు'గా ప్రశంసిస్తూనే, గాంధీజీని 'కన్నింగ్' అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
అహ్మదాబాద్: రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని 'భావి మహాత్ముడు' (Next Mahatma)గా ప్రశంసిస్తూనే, గాంధీజీ (Mahatma Gandhi)ని 'కన్నింగ్' (Cunning) అంటూ గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు (Indranil Rajguru) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తారా? అంటూ గుజరాత్ బీజేపీ నిప్పులు చెరగగా, దానికి రాజ్‌గురు తిరిగి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మే 1న జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌గురు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో మరో మహాత్మాగాంధీ అవుతారని, గాంధీజీ మాత్రం ఒకింత 'కన్నింగ్' అని అన్నారు. రాహుల్ గాంధీ ముక్కుసూటి వ్యక్తి అని, నిష్కల్మష హృదయం కలిగిన వాడని చెప్పారు. రాహుల్ గాంధీ కాబోయే దేశనేత అంటూ ప్రశంసించారు. రాహుల్‌ను 'పప్పూ' అంటూ చిత్రీకరించిన వాళ్లే ఇప్పుడు ఆయనను దేశనేతగా అంగీకరిస్తున్నారని అన్నారు.
Lok Sabha Elections: చెస్, రాజకీయాల్లో రాహుల్ నిష్ణాతుడు... కాంగ్రెస్ కౌంటర్
మహాత్మునిపై విమర్శలా?: బీజేపీ
రాజ్‌గురు చేసిన గాంధీజీ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ మండిపడింది. గాంధీజీ మన జాతిపిత అని, దేశ స్వాంతంత్ర్యోద్యమానికి సారథ్యం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ బొఘర అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను గుజరాత్ ప్రజలు క్షమించరని, ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం గ్రాండ్ ఓల్డ్ పార్టీపై తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు.
కన్నింగ్ అంటే క్లవర్...
కాగా, బీజేపీ విమర్శలపై రాజ్‌గురు తిరిగి స్పందించారు. తాను చరిత్ర పుస్తకంలో మహాత్మాగాంధీపై వాడిన పదమే వాడానని, కన్నింగ్ అంటే తెలివైనవాడనే (క్లవర్) అర్ధం ఉందని చెప్పారు. గాంధీజీపై తాను చాలా చారిత్రక పుస్తకాలు చదవానని, ఒక పుస్తకంలో 'కన్నింగ్' అనే ప్రస్తావన ఉందని, తాను ఏమీ సొంత పదాలు వాడలేదని చెప్పారు. బ్రిటిష్ వారితో గాంధీజీ పోరాడినట్టే ఇవాళ బీజేపీపై పోరాడుతున్న ఒకే ఒకరు రాహుల్ గాంధీ అని, ఆ కారణంగానే తాను రాహుల్‌ను తదుపరి మహాత్ముడిగా అభివర్ణించానని చెప్పారు. దేశ ప్రజస్వామ్యాన్ని ధ్వసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్‌గురు విమర్శించారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 03 , 2024 | 08:51 PM